కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని అబిడ్స్ ప్రాంతంలో తీవ్ర రోడ్డు ప్రమాదం (Abids Accident) చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఒక మహిళపైకి సినీ నిర్మాత బొమ్మకు మురళీకి చెందిన కారు ఒక్కసారిగా దూసుకెళ్లింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి ఆమెను తీవ్రంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆ మహిళ కాలు విరిగిపోయింది. ఒంటిపై తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం సమీపంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో అత్యవసర చికిత్స కోసం అయ్యే ఖర్చులు చెల్లించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు సదరు నిర్మాతను వేడుకున్నారు. అయితే ఆ కారు తనదే అని అంగీకరించిన బొమ్మకు మురళీ, బాధితులకు డబ్బులు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. అంతేకాకుండా యాక్సిడెంట్ చేసిన డ్రైవర్‌ను ఏమైనా చేసుకోండి, కావాలంటే చంపుకోండి అంటూ బాధ్యతారాహిత్యంగా, దురుసుగా సమాధానమిచ్చారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

