కలం, కరీంనగర్ బ్యూరో: మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ కార్పొరేటర్ బండారు వేణు వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ (Challa Harishankar) అన్నారు. బండారు వేణు తన వ్యాఖ్యలపై వెంటనే బేషరతు గా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి గంగుల కమలాకర్ పెట్టిన బిక్షతో రెండు సార్లు కార్పొరేటర్ గా గెలిచి.. స్థాయి మరిచి ఒక వీధి రౌడీ లాగా ప్రవర్తిస్తూ.. తిన్నింటి వాసాలను లెక్కపెట్టే బండారి వేణు నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని చల్ల హరిశంకర్ హెచ్చరించారు. ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహిస్తూ దాడుల సంస్కృతికి తెరలేపిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఒక కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉండి ప్రజలకు రక్షణ కల్పించాల్సింది పోయి.. ఇలాంటి చిల్లర గాళ్లను ప్రోత్సహించడం ఏంటి? అంటూ బండి సంజయ్ ను ప్రశ్నించారు. ఈ చర్యలతో సమాజానికి మీరు ఏం నేర్పుతున్నారని నిలదీశారు. బీజేపీ పార్టీ మేయర్ పీఠం గెలిచి ఆరు నెలలు కాకముందే.. కరీంనగర్ నగరంలో దాడుల సంస్కృతికి తెరలేపారని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తిని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తమ నాయకుడిని కానీ, కార్యకర్తలను కానీ.. ఇబ్బందులకు గురిచేసిన, అనుచిత వాక్యాలు చేసిన ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇప్పటికైనా తమ తప్పును తెలుసుకొని వారంతా బేషరతుగా మాజీ మంత్రి గంగుల కమలాకర్ కి క్షమాపణలు చెప్పాలని లేనిచో.. కరీంనగర్‌లో బీజేపీ నాయకులను తిరగనియ్యకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

