ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో బాబర్‌ అజామ్‌ దూకుడు

కలం, స్పోర్ట్స్ : పాకిస్థాన్ టెస్ట్ కెప్టెన్ బాబర్ అజామ్ (Babar Azam) మళ్లీ ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి ప్రవేశించాడు. రెండేళ్ల తర్వాత ఈ ఘనత సాధించాడు. వెస్టిండీస్‌పై పాకిస్థాన్ టెస్ట్ విజయం సాధించిన అనంతరం బాబర్ ర్యాంకింగ్ భారీగా మెరుగుపడింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన టెస్టులో బాబర్ అజామ్ 88, 24 నాటౌట్ పరుగులు చేశాడు. దీంతో ఐదు స్థానాలు ఎగబాకి 10వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. 2024 సెప్టెంబర్‌లో బాబర్ టాప్-10 నుంచి బయటకు వెళ్లాడు. అంతకుముందు ఐదేళ్ల పాటు వరుసగా టాప్-10లో కొనసాగాడు. బాబర్ కెరీర్‌లో అత్యుత్తమ టెస్ట్ ర్యాంక్ రెండో స్థానం. 2022 డిసెంబర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన స్వదేశీ సిరీస్ సందర్భంగా అతను రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు.

25 స్థానాలు ఎగబాకిన షఫీక్

పాకిస్థాన్ మరో బ్యాటర్ అబ్దుల్లా షఫీక్ కూడా ర్యాంకింగ్స్‌లో భారీగా మెరుగుపడ్డాడు. వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో 160 నాటౌట్, 24 నాటౌట్ పరుగులు సాధించాడు. అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో షఫీక్ ఏకంగా 25 స్థానాలు ఎగబాకి 32వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. బౌలర్లలో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షమార్ జోసెఫ్ 19వ స్థానానికి చేరుకున్నాడు. పాకిస్థాన్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ 30వ ర్యాంక్‌కు ఎగబాకాడు. మొహమ్మద్ అలీ ఎనిమిది స్థానాలు మెరుగుపరుచుకుని 85వ ర్యాంక్‌లో నిలిచాడు. అలీ ఉస్మాన్ ఏకంగా 58 స్థానాలు ఎగబాకి 97వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

వన్డే ర్యాంకింగ్స్‌లో గుర్బాజ్ జోరు

ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘనిస్థాన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ కూడా ముందుకు దూసుకెళ్లాడు. ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో 32, 71 పరుగులు చేయడంతో 11వ స్థానానికి చేరుకున్నాడు. ఐర్లాండ్ బౌలర్ మార్క్ అడైర్ 17వ ర్యాంక్‌కు తిరిగి వచ్చాడు. స్కాట్లాండ్ ఆటగాడు బ్రాండన్ మెక్‌ముల్లెన్ 48వ స్థానానికి చేరుకున్నాడు.

WTCలో పాక్, విండీస్‌కు నిరాశ

పాకిస్థాన్-వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ డ్రాగా ముగియడంతో ఇరు జట్లకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్ల పట్టికలో పెద్దగా ప్రయోజనం దక్కలేదు. ప్రస్తుతం పాకిస్థాన్, వెస్టిండీస్ పట్టికలో చివరి రెండు స్థానాలలో కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియా 87.50 శాతం పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. దక్షిణాఫ్రికా 75 శాతంతో రెండో స్థానంలో, న్యూజిలాండ్ 72.22 శాతంతో మూడో స్థానంలో కొనసాగుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>