చేయూత పింఛన్లపై కలెక్టర్ కీలక ఆదేశాలు

కలం, నిర్మల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘చేయూత’ పింఛన్ల (Cheyutha Pensions) పథకం ద్వారా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పారదర్శకంగా, వేగవంతంగా పింఛన్లు అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్(Nirmal Collector) భవేష్ మిశ్రా ఆదేశించారు. బుధవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కొత్త చేయూత పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్ నమోదు, అర్హతల పరిశీలనతో పాటు ఇందిరమ్మ ఇళ్ళు  వనమహోత్సవం, తెలంగాణ జలసిరి కార్యక్రమాల అమలు పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. ఆయా కార్యక్రమాలపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

ఆగస్టు 31 వరకు దరఖాస్తుల స్వీకరణ

కొత్త చేయూత పింఛన్ల కోసం ఆగస్టు 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకం అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అందిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసి, అర్హతలను నిబంధనల ప్రకారం పరిశీలించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు తమ దరఖాస్తులను గ్రామ పంచాయతీ కార్యదర్శి లేదా ఎంపీడీవో కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. పట్టణ ప్రాంతాల ప్రజలు మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఎక్కడా పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. మండలాల వారీగా నిర్మాణాల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించి, జాప్యానికి కారణాలను గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

వనమహోత్సవం, తెలంగాణ జలసిరి కార్యక్రమాల అమలు పురోగతిపై కూడా కలెక్టర్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసేలా శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, డీఆర్డీవో విజయలక్ష్మి, డీపీవో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్లు రవిబాబు, సుందర్ సింగ్, వివిధ మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>