కలం, వెబ్ డెస్క్ : యాదాద్రి భువనగిరి జిల్లాలో రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy) పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయ ప్రత్యర్థులపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఓడిపోయిన వారు నిరాశ చెందవద్దని, అలాగని కేసీఆర్ లాగా ఫామ్ హౌస్‌కు పరిమితం కావొద్దంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఆయన సూచించారు. భువనగిరి(Bhuvanagiri) నియోజకవర్గ పరిధిలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిలతో కలిసి మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వలిగొండ నుంచి కాటేపల్లి వరకు 49.50 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన రహదారిని వారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు మెంబర్లను నేతలు అభినందించారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) మాట్లాడుతూ.. సర్పంచ్ ఎన్నికలు ముగిశాయని, ఇకపై పంతాలకు పోకుండా గ్రామాభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరారు. రాజకీయాల్లో మనవాడు, పరాయివాడు అనే భేదభావం చూపిస్తే నాయకుడిగా ఎదగలేరని ఆయన హితవు పలికారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy) మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. నూతనంగా నిర్మించిన ఈ రహదారి వల్ల ఈ ప్రాంత ప్రజలకు ప్రయాణ కష్టాలు తీరుతాయని, వాణిజ్య పరంగా కూడా ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నాణ్యమైన రహదారులు నిర్మించడం ద్వారానే సమగ్ర అభివృద్ధి సాధ్యమని, ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని వివరించారు.
Read Also: పాక హనుమంతుకు కన్నీటి వీడ్కోలు
Follow Us On: Pinterest


