కలం, కరీంనగర్ బ్యూరో : సాహిత్యం, చిత్రకళ, జర్నలిజం, కార్టూనింగ్, యానిమేషన్, కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత సంగీతం, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లు, ఫీచర్ ఫిల్మ్ నిర్మాణంలో సృజనకారుడు కల్యాణం శ్రీనివాస్ (Kalyanam Srinivas) ప్రతిభ కనబరుస్తున్నారు. తెలుగు సాహిత్యం, కళలు, యానిమేషన్ మరియు AI ఆధారిత సృజనాత్మక రంగాల్లో ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ గ్లోబల్ అచివర్స్ కౌన్సిల్, సౌత్ వెస్ట్రన్ అమెరికన్ యూనివర్సిటీ (Global Achievers Council, South Western American University) సంయుక్తంగా ఆయనకు తెలుగు సాహిత్యంలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశాయి.
సాహిత్యంతో ప్రారంభమైన శ్రీనివాస్ (Kalyanam Srinivas) ప్రయాణం క్రమంగా విభిన్న రంగాలకు విస్తరించింది. చిన్ననాటి నుంచే సాహిత్యంపై మక్కువ పెంచుకున్న కల్యాణం శ్రీనివాస్ పదో తరగతి నుంచే కవిత్వ రచన ప్రారంభించారు. అనంతరం బి.ఏ. లిటరేచర్ పూర్తి చేసి,ఎం.ఏ. తెలుగు సాహిత్యంలో స్నాతకోత్తర విద్యను అభ్యసించారు. విద్యార్థి దశలోనే “హృదయమన గేయ సంపుటి”, “పిడికిలి కవితా సంపుటి” అనే రెండు పుస్తకాలను ప్రచురించి రచయితగా గుర్తింపు పొందారు.
జర్నలిజంపై ఆసక్తితో ఈనాడు, ఆంధ్రప్రభ దినపత్రికలలో జర్నలిస్టుగా పనిచేశారు. అదే సమయంలో రాజకీయ కార్టూనిస్టుగా కూడా సేవలందిస్తూ సమకాలీన అంశాలపై తనదైన శైలిలో కార్టూన్లు రూపొందించి ప్రశంసలు అందుకున్నారు. సంప్రదాయ 2D అనిమేషన్‌లో రెండు దశాబ్దాల అనుభవం సాధించారు. 1996లో లక్ష్మీపతి స్కాలర్‌షిప్ లభించడంతో హైదరాబాద్‌లో అనిమేషన్ కోర్సు పూర్తి చేసిన ఆయన, అనంతరం దాదాపు 20 సంవత్సరాలకు పైగా Traditional 2D Animation Director గా అనిమేషన్ పరిశ్రమలో పనిచేశారు.
సినిమా భాష, విజువల్ స్టోరీటెల్లింగ్, షాట్ కంపోజిషన్, స్క్రీన్‌ప్లే, కెమెరా వ్యాకరణం, ఎడిటింగ్ తదితర అంశాలపై ఆయనకు ఉన్న లోతైన అవగాహన పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. సంప్రదాయ సినీ నిర్మాణంపై ఉన్న అనుభవాన్ని ఆధునిక సాంకేతికతతో మేళవిస్తూ, గత ఏడాది నుంచి AI ఆధారిత ఫిల్మ్ మేకింగ్ పై విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న వివిధ AI టూల్స్‌ను అధ్యయనం చేస్తూ, వాటి సామర్థ్యాలు, పరిమితులు, పూర్తి స్థాయి సినిమా నిర్మాణంలో వాటి వినియోగంపై నిరంతరం ప్రయోగాలు చేస్తున్నారు.
AI ద్వారా సినిమా నిర్మాణానికి సంబంధించిన తన అనుభవాన్ని యూట్యూబ్, శిక్షణ కార్యక్రమాలు, ఇతర వేదికల ద్వారా వేలాది మందితో పంచుకుంటున్నారు. సాంకేతికతను ప్రతి తెలుగు వ్యక్తికి చేరవేయాలనే లక్ష్యంతో “AI Video Making Telugu” పేరుతో యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించారు. ఈ ఛానల్ ద్వారా AI సంగీతం, AI వీడియోలు, AI షార్ట్ ఫిల్మ్స్, AI సినిమా నిర్మాణం, ఆధునిక AI టూల్స్ వినియోగంపై వేలాది మందికి సులభమైన తెలుగులో అవగాహన కల్పిస్తున్నారు. అనేక రంగాల్లో కల్యాణం శ్రీనివాస్ అందించిన సేవలకు గుర్తింపుగా గ్లోబల్ అచివర్స్ కౌన్సిల్,సౌత్ వెస్ట్రన్ అమెరికన్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయడం పట్ల సాహిత్య, కళా, సినీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.
Also Read : పార్లమెంట్‌కు రావాలంటేనే వారికి భయం: రాహుల్ గాంధీ
Follow Us On : WhatsApp

