కలం వెబ్ డెస్క్ : తైవాన్(Taiwan)లోని యీలాన్(Yilan) నగరానికి సమీపంలో శనివారం రాత్రి భారీ భూకంపం(Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రత నమోదైంది. ఈ భూకంపం ద్వీపం అంతటా ప్రభావాన్ని చూపింది. రాజధాని తైపీ(Taipei)లో భవనాలు కంపించాయి. అయితే భూకంపంతో పెద్దగా నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. సోషల్ మీడియాలో భూకంపం సంభవించినప్పుడు జరిగిన సంఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. భూకంపం సముద్రంలో 73 కిలోమీటర్ల లోతులో సంభవించడం వల్ల నష్టం తక్కువగానే ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. యీలాన్ ప్రాంతంలో 3 వేలకు పైగా ఇళ్లలో కొద్దిసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తైపీ నగరంలో కొన్ని చోట్ల గ్యాస్, నీటి లీకేజీలు, భవనాలకు చిన్న చిన్న పగుళ్లు ఏర్పడినట్టు సమాచారం.
తైవాన్ అధ్యక్షుడు లై చింగ్-తే స్థానిక పరిస్థితిపై సోషల్ మీడియాలో స్పందించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, మరిన్ని ఆఫ్టర్ షాక్‌లు రావొచ్చని జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరారు. రాబోయే రోజుల్లో 5.5 నుంచి 6.0 తీవ్రతతో మరిన్ని ప్రకంపనలు రావొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. తైవాన్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. గతేడాది ఏప్రిల్‌లో సైతం భారీ భూకంపం ద్వీపాన్ని వణికించింది. ఈ ఘటనలో సుమారు 17 మంది ప్రాణాలు కోల్పోయారు.


