కరాటే శిక్షణ ఎంతో ఉపయోగకరం: ఎస్పీ డి.జానకి

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: పోలీసు సిబ్బంది ఉద్యోగపరంగా ఎదురయ్యే వివిధ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ, స్వీయ రక్షణలో సమర్థులుగా తీర్చిదిద్దడంతో పాటు వారి శారీరక, మానసిక సామర్థ్యాలను మరింత పెంపొందించాలనే ఉద్దేశంతో మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు శాఖ (Mahabubnagar Police) ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందికి 45 రోజుల కరాటే శిక్షణా కార్యక్రమాన్ని శనివారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని కవాతు మైదానంలో జిల్లా ఎస్పీ డి.జానకి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో వివిధ రకాల పరిస్థితులు, సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని, అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. స్వీయ రక్షణ నైపుణ్యాలను కలిగి ఉండటం పోలీసు సిబ్బందికి ఎంతో అవసరమని, ఆపద సమయాల్లో తమను తాము రక్షించుకోవడంతో పాటు అవసరమైన సందర్భాల్లో ఇతరులను రక్షించేందుకు కూడా ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.

కరాటే శిక్షణ కేవలం స్వీయ రక్షణకే పరిమితం కాదని, శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, ఏకాగ్రత, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం మరియు త్వరిత నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందిస్తుందని ఎస్పీ తెలిపారు. పోలీసు విధుల్లో భాగంగా వివిధ పరిస్థితులను ఎదుర్కొనే సమయంలో ఈ నైపుణ్యాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. పోలీసు సిబ్బంది తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, శిక్షణలో చురుకుగా పాల్గొని కరాటేలోని మెళకువలను పూర్తిస్థాయిలో నేర్చుకోవాలని ఎస్పీ సూచించారు.

క్రమశిక్షణతో శిక్షణ పొందడం ద్వారా శారీరక సామర్థ్యంతో పాటు ఆత్మవిశ్వాసం పెరిగి, విధి నిర్వహణలో మరింత సమర్థవంతంగా పనిచేయగలుగుతారని పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది తమ కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే ప్రజల భద్రత కోసం విధుల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి శారీరక మరియు మానసిక సామర్థ్యాలను మరింత పెంపొందించేందుకు ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు దోహదపడతాయని జిల్లా ఎస్పీ తెలిపారు.

ఈ 45 రోజుల కరాటే శిక్షణా కార్యక్రమంలో పోలీసు సిబ్బందికి స్వీయ రక్షణ పద్ధతులు, శారీరక దృఢత్వానికి సంబంధించిన వ్యాయామాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే శిక్షణతో పాటు ఆపద సమయాల్లో తమను తాము రక్షించుకునే వివిధ కరాటే మెళకువలను నేర్పించనున్నారు. విధి నిర్వహణలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనే విధంగా సిబ్బందిని శారీరకంగా, మానసికంగా సిద్ధం చేయడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో AR అదనపు ఎస్పీ సురేష్ కుమార్, DSP రమణా రెడ్డి, RIలు కృష్ణయ్య, నగేష్, RSIలు రమేష్, సత్యం, వన్‌టౌన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ వసంతతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Also Read: రేషన్ బియ్యం కోసం ఇంతటి సాహసమా? నిర్మల్‌లో ఆదివాసీల దుస్థితి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>