కలం డెస్క్ : కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరగడానికి బాధ్యతంతా కేసీఆర్‌దేనని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయంతోనే నీటి వాటాలో కోత పడుతోందని కేసీఆర్ కామెంట్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఇప్పటివరకూ బహిరంగంగా జరిగిన మాటలయుద్ధం ఇప్పుడు అసెంబ్లీకి (Telangana Assembly) చేరబోతున్నది. ఈ నెల 29న ప్రారంభమయ్యే అసెంబ్లీ సెషన్‌లో జలవివాదంపై ఇరు పక్షాల మధ్య వాడివేడి వాదనలు జరగనున్నాయి. కాంగ్రెస్ తరఫున ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy), బీఆర్ఎస్ తరఫున ఆ శాఖ మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) చర్చలో పాల్గొననున్నారు. రెండు రోజుల క్రితం ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో ఉమ్మడి పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లా నేతలతో సమావేశమైన కేసీఆర్.. బీఆర్ఎస్ తరఫున హడావిడి అంతా కేటీఆర్, హరీశ్‌రావులు చూసుకుంటారని హింట్ ఇచ్చారు.
సీఎం రేవంత్ సవాలు విసిరినా… :
కృష్ణా జలాల్లో తెలంగాణకు ఎవరి పాలనలో అన్యాయం జరిగిందో తేలుద్దామని.. అసెంబ్లీకి (Telangana Assembly) రావాలని.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాలు విసిరారు. అందులో భాగంగా ఈ నెల 29న ప్రారంభమయ్యే సెషన్‌కు తొలి రోజున కేసీఆర్ హాజరవుతున్నట్లు గులాబీ నేతలు చెప్తున్నారు. ఆ ఒక్క రోజుకే ఆయన పరిమితం కావచ్చనే లీకులు కూడా వచ్చాయి. ఆ రోజున ఎలాగూ కృష్ణా, గోదావరి జలాలపై చర్చ జరగకపోవచ్చని, కేవలం ప్రభుత్వం ఆర్డినెన్సుల స్థానంలో ప్రవేశపెట్టనున్న బిల్లులపై మాత్రమే డిస్కషన్ ఉంటుందన్నది కేసీఆర్ (KCR) భావన. అందుకే ఆ రోజు మాత్రమే ఆయన హాజరైన నదీ జలాలపై జరిగే చర్చ మొత్తాన్ని హరీశ్‌రావు, కేటీఆర్‌కు అప్పజెప్పారన్నది మరో వాదన. సీఎం రేవంత్ సవాలు.. దానికి కేసార్ పాజిటివ్‌గా స్పందించడం జరిగినా.. నదీ జలాలపై చర్చలో మాత్రం ఆయన పాల్గొనే అవకాశాలు తక్కువే.
ఎలాగూ మైక్ కట్ అవుతుందనే అనుమానం :
నదీ జలాల్లో కాంగ్రెస్‌ను విమర్శించే టైమ్‌లో బీఆర్ఎస్ లీడర్ల మైక్‌లు కట్ అవుతాయన్నది కేసీఆర్ రీడింగ్. ఇదే అభిప్రాయాన్ని పరోక్షంగా నేతలతో ప్రస్తావించినట్లు తెలిసింది. హౌజ్ మొత్తం కాంగ్రెస్ కంట్రోల్‌లోకి వెళ్ళిపోతుందని, బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే అవకాశం రాకపోవచ్చని, ఇలాంటప్పుడు చర్చలో పాల్గొన్నా ఫలితం ఉండదనే భావనతోనే ఆయన నదీ జలాల డిస్కషన్‌లో పాల్గొనకుండా వీరిద్దరికి అప్పజెప్పినట్లు తెలిసింది. అసెంబ్లీ రికార్డుల్లోకి ఎక్కేలా కాంగ్రెస్ వైఫల్యాన్ని, కేంద్రానికి రాసిన లేఖల వివరాలను గొంతెత్తి వినిపించాల్సిందిగా ఆ ఇద్దరికీ సూచనలు చేసినట్లు సమాచారం. కేసీఆర్ చర్చలో పాల్గొంటే సీఎం రేవంత్‌రెడ్డి లేవనెత్తే అంశాలకు, చేసే విమర్శలకు సమాధానం ఇచ్చుకోవాల్సి ఉంటుందని, పదేండ్ల పాటు సీఎంగా పనిచేసిన గౌరవాన్ని నిలుపుకునేలా చర్చ జరిగే సమయంలో సభలో లేకపోవడమే బెటర్ అనే అభిప్రాయం కూడా గులాబీ నేతల్లో వ్యక్తమవుతున్నది.
కేసీఆర్ ఉన్నప్పుడే చర్చ మొదలైతే.. :
ఎలాగూ కేసీఆర్ సభకు హాజరైనందున ఆ సమయానికే నదీ జలాల వివాదాన్ని చర్చకు పెట్టాలని నిర్ణయాన్ని స్పీకర్ తీసుకున్నట్లయితే పరిస్థితి ఎలా ఉంటుందనే ఆసక్తికరమైన చర్చ కొద్దిమంది కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతున్నది. పాలమూరు-రంగారెడ్డి సహా కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులపై తెలంగాణ భవన్‌లో కేసీఆర్ ఇటీవల చేసిన విమర్శలను కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకున్నది. అసెంబ్లీ వేదికగానే తిప్పికొట్టాలని భావిస్తున్నది. చర్చ జరగకపోవచ్చనే భావన కేసీఆర్‌కు ఉన్నందున ఆయన సభలో ఉన్నప్పుడే డిస్కషన్‌ను మొదలుపెట్టే అవకాశాలూ లేకపోలేదన్నది కాంగ్రెస్ వర్గాల అభిప్రాయం. కేసీఆర్‌ను ఇరికించాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నది. సీఎం రేవంత్‌తో ఢీకొనడంకంటే సభకు గైర్హాజరు కావడమే ఉత్తమమని గులాబీ నేతలు భావిస్తున్నారు. రెండు పక్షాల మధ్య ఎత్తుకు పై ఎత్తులు ఎలా ఉంటాయనేది ఆసక్తికరం.
Read Also: పాలమూరు ఇష్యూ: అసెంబ్లీ ముంగిట KCRని ఇరికించిన కవిత
Follow Us On: Youtube


