కలం, నిర్మల్: బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి (MLA Alleti) మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. గురువారం హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ మధ్య ఉన్న “ప్రేమ బంధం” మరోసారి బట్టబయలైందని ఆరోపించారు. మూసీ ప్రక్షాళన పేరుతో రూ.21 వేల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన కన్ఫర్డ్ ఐఏఎస్ అధికారి నరసింహారెడ్డి బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సన్నిహితుడని ఆరోపించారు. అలాగే హరీశ్‌రావు వద్ద తొమ్మిదిన్నర సంవత్సరాలు పీఏగా పనిచేసిన అశోక్ రెడ్డికి ఎండీ పదవి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
ఈ నియామకాలే కాంగ్రెస్ – బీఆర్ఎస్ మధ్య ఉన్న చీకటి ఒప్పందానికి నిదర్శనమని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు ఎన్నికల హామీలు, సంక్షేమ పథకాల అమలు కోసం ఎదురుచూస్తుంటే, ప్రభుత్వం మాత్రం వేల కోట్ల రూపాయలను మూసీ పేరుతో ధారపోస్తోందని మండిపడ్డారు. రూ.10 వేల కోట్ల ప్యాకేజీని రెండు భాగాలుగా విభజించి ఆస్థాన గుత్తేదారులకు అప్పగిస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో “ఎవరికి వారే యమునా తీరం” అన్న పరిస్థితి నెలకొందని, ముఖ్యమంత్రి, మంత్రులు రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టే పనిలో ఉన్నారని విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు రూ.82 వేల కోట్ల విలువైన కాంట్రాక్టులను ఆంధ్ర ప్రాంత గుత్తేదారులకు అప్పగించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అవినీతి, అక్రమాన్ని బీజేపీ నిశితంగా పరిశీలిస్తోందని, ఒక్కో అంశాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తామని ఎమ్మెల్యే ఏలేటి హెచ్చరించారు.

