కలం, స్పోర్ట్స్ : ఏహెచ్‌ఎఫ్ జూనియర్ ఆసియా కప్-2026 (Asia Cup 2026) కోసం భారత జూనియర్ మహిళల హాకీ జట్టును (Indian Junior Womens Hockey Team) హాకీ ఇండియా ప్రకటించింది. మిడ్‌ఫీల్డర్ ఖైదెమ్ షిలీమా చానును జట్టు కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 13 వరకు చైనాలోని మొఖీలో జరగనున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం 18 మంది ఆటగాళ్లతో కూడిన ప్రధాన జట్టును, ఇద్దరు ప్రత్యామ్నాయ ఆటగాళ్లను ఎంపిక చేశారు. కొత్త కోచ్ టిమ్ వైట్ మార్గదర్శకత్వంలో భారత జట్టు గత కొన్ని నెలలుగా కఠిన సాధన చేసింది. టోర్నీ సన్నాహాలలో భాగంగా భారత విస్తృత జట్టు ఇటీవల యునైటెడ్ కింగ్‌డమ్‌లో పర్యటించి అంతర్జాతీయ మ్యాచ్‌ల అనుభవాన్ని సొంతం చేసుకుంది. ఈ అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
కోచ్ టిమ్ వైట్ మాట్లాడుతూ.. ఆటగాళ్లు కష్టపడి జట్టులో స్థానం సంపాదించుకున్నారని తెలిపారు. గత కొన్ని నెలల్లో జట్టు అన్ని విభాగాలలో గణనీయంగా మెరుగుపడిందని చెప్పారు. ఆసియాలోని అగ్రశ్రేణి జట్లతో జరిగే ఈ టోర్నీ తమకు కీలక పరీక్షగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రతి మ్యాచ్‌ను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని దేశానికి గర్వకారణంగా నిలవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. టోర్నీ మ్యాచ్‌ల షెడ్యూల్, గ్రూపుల వివరాలను నిర్వాహకులు త్వరలో ప్రకటించనున్నారు.
భారత జూనియర్ మహిళల హాకీ జట్టు:
గోల్‌కీపర్లు: నిధి, ఎంగిల్ హర్ష రాణి మింజ్
డిఫెండర్లు: పూజా సాహూ, సుప్రియా, పూజా మాలిక్, పార్వతి టోప్నో, మధు
మిడ్‌ఫీల్డర్లు: ఖైదెమ్ షిలీమా చాను (కెప్టెన్), తనుజా టొప్పో, బినిమా ధన్, రోష్ని ఐండ్, గీతా యాదవ్
ఫార్వర్డ్స్: లాల్రిన్‌పుయి, పూర్ణిమా యాదవ్, సుఖ్‌వీర్ కౌర్, కృష్ణ శర్మ, సానికా చంద్రకాంత్ మానే, మధు సిదార్
ప్రత్యామ్నాయ ఆటగాళ్లు: ఎఫ్ లాల్బియాక్షియామి, తనుశ్రీ దినేశ్ కడు
జూనియర్ ఆసియా కప్‌లో పటిష్ట ప్రదర్శనతో టైటిల్ సాధించడమే లక్ష్యంగా భారత జట్టు బరిలోకి దిగనుంది.

