కలం, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ఉత్పత్తిని మరింత ప్రోత్సహించే లక్ష్యంతో ‘గోబర్ధన్ పథకం’ అమలు చేయనుంది. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గురువారం ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో కేంద్ర కేబినెట్ మీటింగ్ జరిగింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. క్లీన్ ఎనర్జీ రంగంలో ఇదో కీలక అడుగు అని ఆయన పేర్కొన్నారు. ‘‘కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తిని గణనీయంగా పెంచడం, ఇంధన భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకొచ్చాం. దీన్ని 2026–27 నుంచి 2035–36 వరకు పదేళ్ల పాటు అమలు చేస్తాం. ఇందుకోసం రూ.23,731 కోట్ల కేటాయించాం. దేశీయంగా సీబీజీ ఉత్పత్తిని దాదాపు 10 రెట్లు పెంచడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. సీఎన్‌జీ (రవాణా అవసరాలు), పీఎన్‌జీ (గృహవసరాలు)లో 2026–27లో 3 శాతం సీబీజీ కలపాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 2027–28లో 4 శాతం, 2028–29 నాటికి 5 శాతం కలపాలని టార్గెట్ పెట్టుకున్నాం” అని వెల్లడించారు. అలాగే అసోంలో నేషనల్ హైవే నిర్మాణానికి కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. దీన్ని బైహతా చరియాలీ నుంచి తేజ్‌పూర్ వరకు రూ.8,970 కోట్లతో నాలుగు లేన్లుగా నిర్మించనున్నట్టు వివరించారు.
సీబీజీ తయారీదారులకు ప్రోత్సాహకాలు
= సీబీజీ తయారీదారులకు దీర్ఘకాలిక ఆదాయ భరోసా కల్పించేందుకు దాని ధరను మెట్రిక్ మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (ఎంఎంబీటీయూ)కు రూ.2,110గా నిర్ణయించామని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇది కనీసం పదేళ్లు అమల్లో ఉంటుందని చెప్పారు.
= కొత్తగా ఏర్పాటు చేసే ప్లాంట్లకు (రోజుకు ఒక టన్ను ఉత్పత్తి సామర్థ్యం) రూ.2 కోట్ల వరకు మూలధన సాయం అందిస్తామని వెల్లడించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు క్రెడిట్ గ్యారంటీ ఇస్తామని తెలిపారు.
= సీబీజీ ప్లాంట్లను నేరుగా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌తో అనుసంధానించేందుకు పైప్‌లైన్ సదుపాయాలు కల్పిస్తామని, జిల్లా స్థాయిలో అమలు చేసేందుకు సీబీజీ ఎకో సిస్టమ్ ఛాలెంజ్ ఫండ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
Also Read : యూపీఐ చెల్లింపులపై ఛార్జీల బిల్లుకు లోక్‌సభ ఆమోదం
Follow Us On : WhatsApp

