భారత బాక్సర్లకు అసలు పరీక్ష ముందుందా..?

కలం, స్పోర్ట్స్: గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లు (Indian Boxers) చరిత్ర సృష్టించారు. 10 పతకాలతో టోర్నీని ముగించారు. అందులో 7 స్వర్ణాలు, 3 రజతాలు ఉన్నాయి. దీంతో తొలిసారి కామన్వెల్త్ బాక్సింగ్‌లో భారత్ నంబర్ వన్ దేశంగా నిలిచింది. మహిళల జట్టు ఒక్కటే ఆరు స్వర్ణాలు సాధించి సత్తా చాటింది. అయితే అసలు పరీక్ష ఇప్పుడు మొదలైంది. కామన్వెల్త్‌లో గెలిచిన జోరును ఆసియా క్రీడలు, ఆ తర్వాత ఒలింపిక్స్‌లో కూడా కొనసాగిస్తారా.. అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

గ్లాస్గో విజయం గొప్పదే కానీ..

మాజీ ప్రపంచ ఛాంపియన్ సరితా దేవి, సెలెక్టర్ వెంకటేశన్ దేవరాజన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్లాస్గో విజయం గొప్పదేనని, కానీ అది అంతిమ గమ్యం కాదని చెప్పారు. భారత బాక్సింగ్ అసలైన స్థాయి ఆసియా క్రీడల్లోనే తేలుతుందన్నారు. ఈ విజయానికి మెరుగైన కోచింగ్, స్పోర్ట్స్ సైన్స్, పోషకాహారం, విదేశీ శిక్షణ, దేశీయ పోటీల్లో పెరిగిన పోటీ ప్రధాన కారణాలని తెలిపారు. దీంతో దేశం నలుమూలల నుంచి ప్రతిభావంతులైన బాక్సర్లు వస్తున్నారని చెప్పారు.

తదుపరి టోర్నీకి సిద్ధం కావాలి..

ఆసియా ఖండంలో ఉజ్బెకిస్థాన్, కజకిస్థాన్, చైనా వంటి దేశాలే ఇప్పటికీ బలమైన శక్తులని సరితా దేవి గుర్తు చేశారు. భారత్ ఆ స్థాయికి చేరువవుతున్నా, దాన్ని నిరూపించాల్సింది ఆసియా క్రీడల్లోనే అని చెప్పారు. పతకాలు గెలవడం కంటే వాటి తర్వాత దృష్టి నిలబెట్టుకోవడం మరింత ముఖ్యమని సరితా దేవి అన్నారు. సంబరాల్లో ఎక్కువకాలం గడపకుండా వెంటనే తదుపరి టోర్నీకి సిద్ధం కావాలని సూచించారు.

అదే జోరు ఆసియా క్రీడల్లో..

భారత బాక్సింగ్‌లో గత 15 ఏళ్లుగా జరిగిన మార్పులు ఇప్పుడు ఫలిస్తున్నాయని వెంకటేశన్ దేవరాజన్ చెప్పారు. విదేశీ శిక్షణ, కఠినమైన ఎంపిక పోటీలు భారత బాక్సర్ల (Indian Boxers) స్థాయిని పెంచాయని వివరించారు. గత విజయాల కంటే ప్రస్తుత ప్రదర్శనకే ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. గ్లాస్గోలో భారత్ చరిత్ర సృష్టించింది. ఇప్పుడు అదే జోరును ఆసియా క్రీడల్లో కూడా కొనసాగిస్తేనే ప్రపంచ బాక్సింగ్‌లో భారత స్థాయి మరింత బలంగా నిలుస్తుంది.

Also Read : యూపీఐ చెల్లింపులపై ఛార్జీల బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>