కలం, వెబ్ డెస్క్: సంధ్య థియేటర్‌లో పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో (Pushpa 2 case) పోలీసులు తాజాగా చార్జ్ షీట్ దాఖలు చేశారు. గత ఏడాది డిసెంబర్ 4న ‘పుష్ప-2 ది రూల్’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చారు. అయితే ఈ ఛార్జిషీట్‌లో హీరో అల్లు అర్జున్‌ను ఏ-11గా పేర్కొన్నారు. సంధ్య థియేటర్ (Sandhya Theater) యాజమాన్యాన్ని ప్రధాన నిందితులుగా (ఏ-1) చూపారు.
ఈ దుర్ఘటనలో (Pushpa 2 case) 35 ఏళ్ల మహిళ రేవతి మరణించగా, ఆమె 8 ఏళ్ల కుమారుడు శ్రీతేజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆక్సిజన్ లోపం కారణంగా ఇప్పటికీ చికిత్స పొందుతున్నాడు. పోలీసుల విచారణలో థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యమే ఈ ఘటనకు ప్రధాన కారణమని నిర్ధారణకు వచ్చారు. భారీ సంఖ్యలో అభిమానులు సమకూరుతారని తెలిసి కూడా తగిన భద్రతా ఏర్పాట్లు, క్రౌడ్ మేనేజ్‌మెంట్ చేయకపోవడం, విఐపీలకు ప్రత్యేక మార్గాలు లేకపోవడం వంటి లోపాలు గుర్తించారు.
అల్లు అర్జున్ (Allu Arjun), ఆయన మేనేజర్, వ్యక్తిగత సిబ్బంది 8 మంది బౌన్సర్ల పేర్లను కూడా ఛార్జిషీట్‌లో చేర్చారు. పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారని తెలిసి థియేటర్‌కు వెళ్లడం, సరైన సమన్వయం లేకుండా రావడం వల్ల తొక్కిసలాటకు దోహదపడిందని పోలీసులు పేర్కొన్నారు. గతంలో ఈ కేసులో అల్లు అర్జున్‌ను అరెస్టు చేసి, బెయిల్ మీద విడుదల చేశారు. ఈ ఛార్జిషీట్ నంపల్లి కోర్టులో దాఖలు కాగా, కేసు ఇక తదుపరి విచారణ దశకు చేరనుంది. బాధిత కుటుంబానికి అల్లు అర్జున్, పుష్ప చిత్ర బృందం ఆర్థిక సాయం అందించిన విషయం తెలిసిందే.
Read Also: వివాదంలో రాంచరణ్ ‘పెద్ది’
Follow Us On: X(Twitter)


