ఢిల్లీ పార్టీల చేతిలో తల్లడిల్లుతున్న తెలంగాణ: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పుట్టడమే పదవి త్యాగంతో పుట్టిందని ఉద్యమ నాటి స్మృతులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR ) గుర్తు చేశారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీటింగ్ లో కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ 2006లో రాజీనామా చేసి వెంటనే మళ్ళీ 2008లో రాజీనామా చేసినప్పుడు తాను జయశంకర్ సార్ తో వాదన పెట్టుకున్నానని అన్నారు.

కాంగ్రెస్ లో విలీనం చేయొద్దన్నారు..

అప్పుడు సార్ తనతో ఉద్యమానికి మూడు పార్శ్వాలు ఉంటాయని.. అవి మొదటి దశ భావజాల వ్యాప్తి, రెండవ దశ ఆందోళనాపథం అని వివరించారని అన్నారు. ఈ రెండు కలిసి రాజకీయ శక్తిగా మారి యాచించే స్థాయి నుండి శాసించే స్థాయికి పోయి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తేవాలని గొప్ప మాట అన్నారని గుర్తు చేశారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పారని తెలిపారు. ఢిల్లీ వాళ్లతో రాజీ లేకుండా, కాంప్రమైజ్ కాకుండా కేసీఆర్‌లా సింహంలా ఉండాలని, తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయొద్దని అన్నాడని గుర్తు చేశారు.

రేవంత్ రెడ్డికి చంద్రబాబు గురువు

ఢిల్లీ పార్టీల చేతిలో మళ్ళీ తెలంగాణ తల్లడిల్లుతుందని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమకు జయశంకర్ సార్ గురువు అయితే.. రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గురువు అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి సామంత రాజు లాగా 32 నెలల్లో 75 సార్లు ఢిల్లీకి వెళ్లాడని విమర్శించారు. 13 రోజులకు ఒకసారి ఢిల్లీకి పోయి వాళ్ల దగ్గర యాచిస్తున్నాడో, వాళ్లకి ఇచ్చొస్తున్నాడో తెలీదు అంటూ దుయ్యబట్టారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు రద్దు చేయడానికి కుట్రలు జరుగుతున్నయని హరీష్ రావు స్పష్టంగా చెప్పారని అన్నారు. లోక్‌సభలో ఒక బీజేపీ ఎంపీ తెలంగాణను పాకిస్తాన్‌ ఏర్పాటుతో పోలిస్తే కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరైనా మాట్లాడారా? అని ప్రశ్నంచారు. అదే మన బీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభలో ఉంటే ఆ పరిస్థితి ఉండనిచ్చేనా? అని అడిగారు.

ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్షనేత మధుసూధనాచారి, మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, సురభి వాణీదేవి, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీతా, గండ్ర వెంకటరమణ, బానోత్ శంకర్ నాయక్, కోరుకంటి చందర్, మెతుకు ఆనంద్, బిగాల గణేష్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>