కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ (Digvijay Singh) సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు కాంగ్రెస్లో అలజడులు సృష్టిస్తున్నాయి. ప్రధాని మోడీ పాత ఫోటోను ఎక్స్ లో పోస్టు చేస్తూ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ఎల్కే అద్వాణి కుర్చీలో కూర్చొని ఉండగా నేలపై మోడీ కూర్చున్న ఫోటోను షేర్ చేస్తూ.. నేలపై కూర్చున్న వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి అయ్యారు అని బీజేపీ సంస్థాగత నిర్మాణాన్ని దిగ్విజయ్ సింగ్ ప్రశంసించారు.
అంతే కాకుండా ఏఐసీసీ చీఫ్ మల్లి కార్జున ఖర్గే(Mallikarjun Kharge)తో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కూడా దిగ్విజయ్ సింగ్ ట్యాగ్ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. తన పోస్టు వివాదాస్పదం కావడంతో దిగ్విజయ్ వివరణ ఇచ్చారు. తాను బీజేపీ సంస్థాగత నిర్మాణం గురించి మాత్రమే పోస్టు చేశానని.. బీజేపీతో ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాననని ఆయన వెల్లడించారు.
అయితే, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశాలు జరుగుతున్న సమయంలోనే దిగ్విజయ్ సింగ్ ఇలాంటి పోస్ట్ పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పోస్టుతో కాంగ్రెస్లో కిందిస్థాయి నాయకుడికి ప్రాధాన్యం లేదని పరోక్షంగా డిగ్గి రాజా ప్రస్తావించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, మొన్నటి వరకు శశిథరూర్ కేంద్రం ప్రభుత్వంతో పాటు ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు మరో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ (Digvijay Singh) ఇదే తరహా పొగడ్తలు చేయడంతో కాంగ్రెస్ కు తలనొప్పిగా మారిందనే చెప్పొచ్చు.
Read Also: తిరగబడుతున్న టీడీపీ కార్యకర్తలు.. తప్పు చేశామంటూ ఆవేదన
Follow Us On: Sharechat


