కలం, నల్లగొండ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఆగస్టు 6 నుంచి 12 వరకు.. జిల్లా వ్యాప్తంగా ‘ప్రజా చైతన్య యాత్రలు’ నిర్వహించనున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం (MLC Nellikanti Satyam) తెలిపారు. సోమవారం నల్లగొండలోని (Nalgonda) సిపిఐ జిల్లా కార్యాలయంలో నల్పరాజు రామలింగయ్య అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక ఆర్థిక విధానాలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్య, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, రైతులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ యాత్రల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తామని తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాలలో పార్టీ శ్రేణులు ఈ యాత్రలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించాలంటే దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఎస్‌ఎల్‌బీసీ, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో పూర్తి చేయాలని నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. ఇందుకు అవసరమైన నిధులు కేటాయించి నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని కోరారు. ఈ సీజన్‌లో జిల్లాలో వర్షపాతం తగ్గడంతో భూగర్భ జలాలు పడిపోయి బోరు బావులపై ఆధారపడిన వరి పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించి, నష్టపోయిన రైతులకు తక్షణమే పంట నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అనంతరం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సిపిఐ రూపొందించిన “బద్రావ్ జరూరీ హై – మార్పు కావాలి” అనే వాల్ పోస్టర్‌ను పార్టీ నాయకులు విడుదల చేశారు. ఈ సమావేశంలో సిపిఐ సీనియర్ నాయకులు ఉజ్జిని రత్నాకర్ రావు, మల్లేపల్లి ఆదిరెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి, లొడంగి శ్రవణ్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉజ్జిని యాదగిరి రావు, పబ్బు వీరస్వామి, ఆర్. అంజచారి, బంటు వెంకటేశ్వర్లు, టి. వెంకటేశ్వర్లు, తూము బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

