ఉజ్జయిని మహంకాళి రంగం.. అమ్మవారి హెచ్చరిక!

కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఈసారి భారీ ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు తప్పవని మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, భీకరమైన వర్షాలతోపాటు అగ్నిప్రమాదాలూ జరుగుతాయని హెచ్చరించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయ బోనాల్లో భాగంగా సోమవారం రంగం (Mahankali Rangam) కార్యక్రమం జరిగింది. ఇందులో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఇందుకోసం రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. ‘‘నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు? ప్రతి ప్రశ్నకు నేనే ఎందుకు సమాధానం చెప్పాలి? నేను మీ మాటలను గౌరవిస్తున్నాను. కానీ మీరు నా మాటను ఆచరిస్తున్నారా? నేను కోరింది చేస్తున్నారా?’’ అని మాతంగి స్వర్ణలత ప్రశ్నించారు.

తనను విశ్వసించిన భక్తులకు ఎల్లప్పుడూ అండగా నిలిచి, వారి కష్టాలను తొలగిస్తూ ప్రతి ఆపదలోనూ రక్షణగా ఉంటానన్నారు. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేస్తామన్న మాటను ఇప్పటికీ నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలల్లో విగ్రహ ప్రతిష్టాపన పూర్తి చేయకపోతే తన ఉగ్రరూపం చూస్తారని, ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ ఏడాది రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని, వరదల కారణంగా అనేక ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రాణనష్టం జరిగే పరిస్థితులు తలెత్తే అవకాశముందన్నారు.

– అగ్నిప్రమాదాలు కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయని, ప్రకృతి విపత్తుల ప్రభావం తీవ్రంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయని మాతంగి స్వర్ణలత భవిష్యవాణిలో ప్రస్తావించారు.
– ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు. తన మాటలను గౌరవించి ధర్మాన్ని పాటిస్తూ భక్తితో జీవిస్తే తన అనుగ్రహం అందరిపై ఉంటుందని అమ్మవారి వాక్కుగా స్వర్ణలత చెప్పారు.

జోగినీలకు ప్రత్యేక కార్డులు: పొన్నం

లష్కర్లో రంగం కార్యక్రమం అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన అంశంపై దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి నివేదిక సమర్పించాక ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. జోగినీలకు ఆలయ దర్శనాల కోసం ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు. మున్సిపల్ కార్పొరేషన్లలో సభ్యత్వం కల్పించే అంశంపై ఇప్పటికే కేబినెట్ నిర్ణయం తీసుకుందని, వారికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నామని, దేవాదాయ శాఖ కమిటీల్లో జోగినీలకు గుర్తింపు కల్పించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నదని ఆయన వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>