కలం వెబ్ డెస్క్ : విశాఖ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant)పై ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan)లు యాక్టింగ్ చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి విమర్శించారు. పదకొండేళ్లుగా మోడీ ప్రధానిగా ఉన్నారని అయినా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగడం లేదన్నారు. పవన్ అధికారంలో లేనప్పుడు స్టీల్ ప్లాంట్ గురించి స్పీచ్‌లు దంచికొట్టేవాడని, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై జగ్గారెడ్డి (Jagga Reddy) శనివారం ఏపీ కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. ఆ రోజుల్లో ఇందిరా గాంధీ స్టీల్ ప్లాంట్ ప్రకటించి రూ.14,000 కోట్ల నుంచి రూ.26 వేల కోట్లు వరకు ఖర్చు చేశారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంతోమందికి ఉపాధి కల్పించిందన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో అయినా, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంలో అయినా స్టీల్ ప్లాంట్ ఎంతో కీలకంగా ఉందని జగ్గారెడ్డి అన్నారు. నష్టాలు వస్తున్నా యూపీఏ హయాంలో స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకుంటూ వచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ ఆస్తి రూ.2.5 లక్షల కోట్లుగా ఉందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దానిపై ప్రధాని మోడీ కన్ను పడిందని, చాలా తెలివిగా ఎవరికో కట్టబెట్టాలనే దురుద్దేశంతో కుట్రలు ప్రారంభించారన్నారు. కార్మికులు స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవడం కోసం ఎన్నో ఉద్యమాలు, దీక్షలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్‌కు కార్యకర్తలే మిగిలారన్నారు. రాష్ట్ర విభజన అనంతరం మొదట చంద్రబాబు, తర్వాత జగన్(YS Jagan), అనంతరం మళ్లీ చంద్రబాబు అధికారం చేపట్టారన్నారు.
స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) కోసం పార్లమెంట్‌లో ఫైట్ చేయడానికి కాంగ్రెస్(Congress)కు ఎంపీలు లేరన్నారు. స్థానికంగ రోడ్డుపై ధర్నా చేద్దామన్నా ఎమ్మెల్యేలు లేరన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన తెలపాలన్నా పోలీసులు అనుమతులు ఇవ్వడం లేదన్నారు. మోడీతో జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు మంచి సంబంధాలున్నాయని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మారుతున్నా స్టీల్ ప్లాంట్ కార్మికుల దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ విషయాలను గమనించాలని కోరారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు కమిట్మెంట్ కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. మూడు పార్టీల హీరోలు నాటకాలు వేస్తూ దారుణానికి పాల్పడుతున్నారన్నారు. కులాల మీద రాజకీయాలు చేస్తున్నారని, కుల పిచ్చిలో ప్రజలు ఏపీ నాయకులకు పట్టం కడుతున్నారన్నారు. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనేది గుర్తు తెచ్చుకొని ప్రజలు మూడు పార్టీల నేతలను నిలదీయాలన్నారు. ఆయా పార్టీల ఎంపీలు పార్లమెంట్‌లో ఏం చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
Read Also: మహిళలు, పిల్లలపై పెరిగిన నేరాలు.. హైదరాబాద్ కమిషనరేట్ వార్షిక నివేదిక విడుదల
Follow Us On: X(Twitter)


