కలం, వెబ్ డెస్క్ : కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి (MLA Virupakshi)ని చిప్పగిరి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన్ని పోలీసులు ఆలూరు సివిల్ జడ్జి ఎదుట హాజరుపరుచగా.. కోర్టు ఎమ్మెల్యే విరూపాక్షితో సహా ఆయన కుమారుడు 15 మంది వైసీపీ కార్యకర్తలకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వారిని పోలీసులు జైలుకు తరలించనున్నారు.
కాగా, చిప్పగిరి మండలం నేమకల్లు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త గురునాథ్, సంగాలకు చెందిన వైసీపీ కార్యకర్త గిరి ఫోన్ లో జరిగిన వ్యక్తిగత దూషణలు ఉద్రిక్త పరిస్థితికి దారి తీశాయి. తమ కార్యకర్తను అవమానించారనే కారణంతో ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి నేమకల్లు గ్రామానికి వెళ్లారు. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య పరస్పరం దాడి జరిగింది. ఈ దాడిలో టీడీపీ కార్యకర్త శేఖర్ తలకు తీవ్ర గాయమైంది. ఎమ్మెల్యే తమ్ముడి శ్రీరాములు చేతికి స్వల్ప గాయమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఘర్షణను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ కార్యకర్త ఫిర్యాదు మేరకు పోలీసులు ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు పలువురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అనంతరం ఎమ్మెల్యేతో పాటు మరికొంత మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

