కలం, స్పోర్ట్స్ : కామన్వెల్త్ గేమ్స్-2026లో (Commonwealth Games 2026) భారత మహిళా అథ్లెట్లు స్వర్ణ పతకాల వర్షం కురిపిస్తూ దేశ కీర్తిని మరింత ఎత్తుకు తీసుకెళ్తున్నారు. భారత్ ఇప్పటివరకు సాధించిన 13 స్వర్ణ పతకాలలో ఎనిమిది మహిళా క్రీడాకారిణులే గెలవడం విశేషం. ఈ అద్భుత విజయాలపై భారత ఒలింపిక్ సంఘం (IOA) అధ్యక్షురాలు పీటీ ఉష (PT Usha) హర్షం వ్యక్తం చేశారు. భారత మహిళా అథ్లెట్ల విజయాలు దేశానికి గర్వకారణమని ఆమె అన్నారు. ఈ పతకాల వెనుక క్రీడాకారిణులు, వారి కుటుంబ సభ్యులు, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్ ఎన్నో ఏళ్లుగా చేసిన కృషి, త్యాగం దాగి ఉందని పేర్కొన్నారు. ప్రతి పతకం వారి పట్టుదల, అంకితభావానికి నిదర్శనమని కొనియాడారు.
వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను స్వర్ణ పతకం సాధించి మరోసారి తన ఆధిపత్యాన్ని చాటగా, పారా అథ్లెటిక్స్‌లో శర్మిలా ధన్కర్ పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నారు. జూడోలో అస్మితా డే చరిత్ర సృష్టిస్తూ కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించారు. బాక్సింగ్‌లో భారత మహిళలు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. సాక్షి చౌదరి, ప్రీతి పవార్, జైస్మిన్ లాంబోరియా, ప్రియా ఘంగాస్, అరుంధతి చౌదరి స్వర్ణ పతకాలు గెలిచి భారత పతకాల ఖాతాను మరింత బలోపేతం చేశారు. ఈ విజయాలు దేశంలోని చిన్నారులు, యువ క్రీడాకారిణులకు స్ఫూర్తిదాయకమని పీటీ ఉష అన్నారు. భారత జెర్సీ ధరించి అంతర్జాతీయ వేదికపై సత్తా చాటాలనే కలలను ఈ క్రీడాకారిణులు నిజం చేస్తున్నారని, ఇదే నిజమైన ‘నారీ శక్తి’ అని ఆమె ప్రశంసించారు.

