కలం, నిజామాబాద్ బ్యూరో: తెలంగాణలోని మహారాష్ట్ర కర్నాటక బార్డర్లలో రెచ్చిపోయిన ఏటీఎం దొంగలు ఈసారి నిజామాబాద్‌ను ( Nizamabad)ను టార్గెట్ చేశారు. నిజామాబాద్‌లో రెండు వేర్వేరు చోట్ల ఏటీఎం మెషీన్లను ధ్వంసం చేశారు. డబ్బులు తీసుకోవడం సాధ్యపడకపోవడంతో ఏకంగా నిప్పు పెట్టి మరీ దాదాపు 52 లక్షలకుపైగా దోచుకెళ్లారు. నగర నడిబొడ్డున ఈ దోపిడీ జరగడం పోలీసులకు సవాల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ నగరంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు దుండగులు ఏటీఎంల చోరీకి పాల్పడ్డారు. బైక్‌పై వచ్చిన దొంగలు ఎస్బీఐ ఏటీఎంలోకి చొరబడి ధ్వంసం చేశారు. కానీ యంత్రం తెరుచుకోకపోవడంతో తగలబెట్టారు. అనంతరం ఏటీఎంలోని సుమారు రూ. 27 లక్షల నగదును దోచుకెళ్లారు.
అలాగే నాలుగో ఠాణా పరిధిలోని మరో ఏటీఎం (ATM) దోపిడీ చోటు చేసుకుంది. అక్కడ ఏటీఎం కూడా తెరుచుకోకపోవడంతో నిప్పు పెట్టారు. అందులోని దాదాపు రూ. 25 లక్షల నగదును దోచుకున్నారు. ఒకేరోజు నిజామాబాద్ నగరంలో రెండు ఏటీఎంల చోరీ ఘటనలు సంచలనంగా మారాయి. ఈ మేరకు డీసీపీ బసవ రెడ్డి, ఏసీపీ రాజా వెంకట్ రెడ్డిలు ఏటీఎం కేంద్రాలను పరిశీలించారు. సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఓసారి బైక్, మరోసారి కారులో రెక్కీ నిర్వహించిన అనంతరం దోపిడీకి పాల్పడ్డట్లు తెలుస్తోంది. నిజామాబాద్ నగరంలో ఒకేరోజు సినీఫక్కీలో రెండు ఏటీఎంల దోపిడీ కలకలం రేపుతోంది. ఎటీఎంలు తగలబెట్టడం లాంటి కొత్త టెక్నిక్ నిజామాబాద్ నగరంలో సైతం వాడేంత ధైర్యం చేయడం ఆందోళనకు గురిచేస్తోంది.


