కలం, ఖమ్మం బ్యూరో : దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం (Bhadrachalam) శ్రీ సీతారామచంద్రస్వామి వారి దివ్యక్షేత్రంలో ‘శ్రీరామకోటి’ నిమజ్జనోత్సవ కార్యక్రమం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. వర్షాకాలంలో పవిత్ర గోదావరి నది సమృద్ధిగా ప్రవహిస్తున్న తరుణంలో, ఏటా నిర్వహించే ఆనవాయితీ ప్రకారం ఈ ఏడాది కూడా రామకోటి గ్రంథాల నిమజ్జన వేడుకను ఆలయ అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
దేశవ్యాప్తంగా ఉన్న శ్రీరామ భక్తులు ఎంతో నిష్ఠతో, ఆధ్యాత్మిక చింతనతో రాసిన ‘శ్రీరామకోటి’ గ్రంథాలను భద్రాద్రి రామయ్య పాదాల చెంత సమర్పిస్తుంటారు. భక్తులు అందజేసిన ఈ పవిత్ర పుస్తకాలకు భద్రాచలం క్షేత్రంలో ఏడాది పొడవునా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సంవత్సరం పాటు పూజలు అందుకున్న ఆ గ్రంథాలను, వర్షాకాలంలో గోదావరి జలాలు నిండుగా ఉన్న సమయంలో నిమజ్జనం చేయడం ఇక్కడ తరతరాలుగా వస్తున్న సంప్రదాయం.
ఈ నిమజ్జన కార్యక్రమానికి ముందుగా తీరంలో శ్రీరామచంద్రమూర్తికి, పవిత్ర గోదావరి నదికి వేద మంత్రోచ్ఛారణల నడుమ విశేష పూజలు జరిపారు. గోదావరి అమ్మవారికి పట్టువస్త్రాలు, నైవేద్యం సమర్పించి దివ్య నివేదన చేశారు. అనంతరం రామకోటి గ్రంథాలను భక్తిశ్రద్ధలతో గోదావరి నదిలో నిమజ్జనం చేశారు.
శాస్త్ర ప్రమాణాల ప్రకారం ఈ విధంగా రామకోటి పుస్తకాలను పవిత్ర నదికి సమర్పించడం వల్ల లోకశాంతి, సమాజానికి శ్రేయస్సు, ప్రజలకు మనశ్శాంతి చేకూరుతాయని ఆలయ అర్చకులు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో ఆలయ అధికారులు, అర్చక బృందం పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Also Read : హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Follow Us On : WhatsApp

