ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ఈ తప్పులు చేయకండి!.. నిపుణుల హెచ్చరిక

కలం, వెబ్ డెస్క్: ఐస్ క్రీమ్ (Ice Cream).. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతిఒక్కరూ ఎంతో ఇష్టంగా తినే తీపి పదార్థం. నేటి ఆధునిక యుగంలో కాలంతో సంబంధం లేకుండా ఐస్ క్రీమ్‌ను ఆస్వాదిస్తున్నారు. వెనీలా, స్ట్రాబెరీ, బటర్ స్కాచ్ ఇలా చాలా ఫ్లేవర్లలో దొరికే ఐస్ క్రీమ్‌లను పండగలు, పార్టీలు, ఇలా ప్రత్యేక సందర్భాలలో తినడం అలవాటుగా మారిపోయింది. ఐస్ క్రీమ్ తిన్నప్పుడు మనం చేసే కొన్ని పొరపాట్లు దంతాలు, జీర్ణక్రియ, నోటి ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ఈ కింది పొరపాట్లు చేయకూడదని (Health Tips) సూచించారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

చేయకూడని పొరపాట్లు
ఐస్ క్రీమ్ తిన్న వెంటనే వేడి నీళ్లు తాగడం

కొంత మంది ఐస్ క్రీమ్ తిన్న వెంటనే వేడి నీళ్లు తాగుతారు. కానీ ఐస్ క్రీమ్ తిన్నవెంటనే వేడినీళ్లు తాగడం వల్ల దంతాలు సున్నితంగా మారే అవకాశం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి ఐస్ క్రీమ్ తిన్న 10 నుంచి 15 నిమిషాల తర్వాత మాత్రమే సాధారణ లేదా గోరువెచ్చని నీరు తాగాలట.

మౌత్ వాష్ చేసుకోకపోవడం

సాధారణంగా ఐస్ క్రీమ్ లో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఐస్ క్రీమ్ తిన్న వెంటనే మౌత్ వాష్​ చేసుకోకపోతే బ్యాక్టీరియా పెరిగి దంతక్షయం, నోటి దుర్వాసన వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

తిన్న వెంటనే పడుకోవడం

చాలా మంది రాత్రి భోజనం చేసిన తర్వాత ఐస్ క్రీమ్ తిని వెంటనే నిద్ర పోతుంటారు. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ మందగించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఐస్ క్రీమ్ తిన్నవెంటనే పడుకోవడం వలన అజీర్ణం, గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అందుకే తిన్న తర్వాత కనీసం 30 నుంచి 40 నిమిషాలు ఆగి పడుకోవాలని చెబుతున్నారు.

ఎక్కువ చల్లని పదార్థాలు తినడం

ఐస్ క్రీమ్ తిన్న వెంటనే చల్లని నీరు, కూల్ డ్రింక్స్ వంటివి తాగకూడదట. అంతే కాకుండా ఫ్రిజ్ లో పెట్టిన పండ్లు వంటి చల్లటి పదార్థాలు తినకూడదట. ఇలా చేయడం వలన గొంతులో అసౌకర్యం పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

గొంతు సమస్య ఉంటే జాగ్రత్త

గొంతు సమస్యలు ఉన్నవారు ఐస్ క్రీమ్ తినే ముందు వైద్యుని సలహా తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఉదాహరణకు.. గొంతు ఇన్ఫెక్షన్, టాన్సిల్స్ వాపు లేదా జ్వరం ఉన్నవారు ఐస్‌క్రీమ్ తినే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

(Note: ఈ సమాచారం కేవలం పాఠకుల ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. ఇది ఎలాంటి వైద్య చికిత్స లేదా నిపుణుల సలహాకు ప్రత్యామ్నాయం కాదు)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>