ఎల్లంపల్లి, SRSP వల్లే నేడు తెలంగాణకు నీళ్లు: మేడిపల్లి సత్యం

కలం, కరీంనగర్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వంలో పంట పొలాల్లో నీరు పారుతుంటే.. అసూయతో బీఆర్ఎస్ నేతల కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నాయని చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం (Medipalli Satyam) ఎద్దేవా చేశారు. జిల్లా వ్యాప్తంగా రెండు మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ప్రజలకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా ఎరువుల పంపిణీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ను కలిసి కోరినట్లు ఆయన తెలిపారు.

అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావంతో కరువు వస్తుందని, ఆందోళన పడ్డ రైతులు విస్తారమైన వర్షాలతో ప్రస్తుతం సంతోషంగా దుక్కి దున్నుకుంటూ నాట్లు వేస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఈసారి కరువుతో కాంగ్రెస్ పార్టీ పని అయిపోతుందని రైతులను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుదామని మొన్నటి వరకు బీఆర్ఎస్ నేతలు కన్న కలలన్నీ వమ్ము చేస్తూ భగవంతుడు ఆశీర్వదించాడన్నారు.

వర్షాలు పడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవాలని బీఆర్ఎస్ నేతలు ఏడుపుగొట్టు రాజకీయాలు చేశారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ నేతల చెంప చెల్లుమనిపించేలా సకాలంలో వర్షాలు పడటం రైతులకు ఎంతో ఉపశమనం కలిగించాయన్నారు. ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టు కట్టామని బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయినప్పటికీ రెండున్న సంవత్సరాల నుంచి దానికి సంబంధం లేకుండా నీళ్లు ఇవ్వడం కాంగ్రెస్ ఘనతేనన్నారు.

కాంగ్రెస్ పార్టీ కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, శ్రీరాంసాగర్ వరద కాలువ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి జీవాధారం అయ్యిందని, కాలేశ్వరం ఒక ఆఫ్టర్ ఫ్లాప్ ప్రాజెక్టు అని దుయ్యబట్టారు. కన్నేపల్లి పంపు ఆన్ చేయకుండానే రెండున్నర సంవత్సరాలుగా నీళ్లిస్తున్నామని చెప్పారు. గిరి ప్రదక్షిణ చేస్తే వర్షాలు వస్తాయా.. నడిస్తే వర్షాలు పడతాయా? అంటూ బీఆర్ఎస్ నేతలు దొంగ ధర్నాలు చేశారని, తాము చేయడం వల్లే వర్షాలు పడ్డాయన్నారు. 2023 తర్వాత ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఒక ముగిసిన అధ్యాయమని అన్నారు. కలెక్టర్ ను కలిసిన వారిలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పురుమల్ల మనోహర్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యం శంకర్, తదితరులు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>