కలం, వెబ్ డెస్క్: వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Ramakrishna Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పారదర్శకంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తోందని అభిప్రాయపడ్డారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. తమ నేత వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజాదరణ పెరుగుతోందని చెప్పారు. ఈ మేరకు గుంటూరు జిల్లాలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోషల్ మీడియా విభాగ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచాలని పార్టీ (YSRCP) శ్రేణులకు సజ్జల సూచించారు. గ్రామస్థాయి నుంచి సోషల్ మీడియాను వాడుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వం తమపై పెట్టిన అక్రమ కేసులు, వేధింపులు డిజిటల్ డైరీలో నమోదు చేసుకోవాలని అన్నారు. కార్యకర్తలు వివరణ ఇచ్చే పరిస్థితి నుంచి అటాకింగ్ మోడ్ లోకి రావాలన్నారు.
రాష్ట్ర ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర అప్పుల ఊబిలోకి నెట్టి అబద్ధాలతో స్వర్గం చూపిస్తోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం పాలనలో విఫలమై, ప్రశ్నించే వారిపై వ్యక్తిత్వ హననానికి దిగుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల ఆకాంక్షలే శ్రీరామరక్షగా తమ పార్టీ ధృఢంగా నిలబడిందని చెప్పుకొచ్చారు.

