కలం, వెబ్ డెస్క్ : టెక్ దిగ్గజం గూగుల్ మరో అదిరిపోయే ఫీచర్ తీసుకొచ్చింది. ఇన్నాళ్లూ వేరే భాష మాట్లాడేవారితో వీడియో కాల్ మాట్లాడాలంటే చాలా తిప్పలు పడాల్సి వచ్చేది. ప్రత్యేకంగా ఒక ట్రాన్స్‌లేటర్‌ను వినియోగించాల్సి ఉండేది. కానీ ఈ సమస్యకు గూగుల్ చెక్ పెట్టింది. గూగుల్ తన వీడియో కాల్ సర్వీస్ గూగుల్ మీట్ (Google Meet) కోసం కొత్త రియల్‑టైమ్ స్పీచ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇది యూజర్లు మాట్లాడే భాషను అక్కడిక్కడే వారు ఎంచుకున్న భాషలోకి అనువదిస్తుంది. ఈ ఫీచర్‌తో వేరేవేరే భాషలు మాట్లాడే వారి మధ్య సంభాషణ కూడా చాలా సహజంగా సాగుతుంది.
ఈ ఫీచర్ గూగుల్ ఐ/ఓ (Google I/O) 2025 లో పర్ఫార్మ్ చేశారు. ఏఐ(AI) ఆధారిత పెద్ద లాంగ్వేజ్ మోడల్ ఉపయోగించి, ఇది మాట్లాడే వ్యక్తి మాటలోని టోన్, భావాన్ని, వ్యక్తిగత స్వభావాన్ని కూడా ఉంచుతూ ట్రాన్స్‌లేట్ చేస్తుంది. శబ్దం రోబోటిక్‌లా కాకుండా సహజంగా వినిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ బీటా వెర్షన్లో అందుబాటులో ఉంది. మొదటగా ఇంగ్లీష్‑స్పానిష్ భాషలు సపోర్ట్ అవుతున్నాయి. భవిష్యత్తులో ఇటాలియన్, జర్మన్, పోర్చుగీస్ వంటి మరిన్ని భాషలను కూడా జతచేయనున్నట్లు గూగుల్ ప్రకటించింది.
ఈ సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ, వ్యాపార, విద్యా, కుటుంబ సమావేశాలు వంటి విభాగాలకు సూటబుల్ గా ఉంటుందని గూగుల్ బృందం తెలిపింది. ఈ ఫీచర్ మాటలోని ఉచ్చారణ, లయ, భావాన్ని పరిగణలోకి తీసుకుని అనువాదాన్ని అందిస్తుంది. ప్రాథమికంగా ఈ ఫీచర్ గూగుల్ ఏఐ ప్రో (Google AI Pro), ఏఐ అల్ట్రా (AI Ultra) సభ్యులకు అందుబాటులో ఉంటుంది. భవిష్యత్తులో గూగుల్ వర్క్‌స్పేస్ (Google Workspace) ద్వారా వ్యాపార వినియోగదారులకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ తెలిపింది.
Read Also: ఇలాంటి పాస్‌వర్డ్ వాడుతున్నారా.. అయితే జాగ్రత్త..!
Follow Us On : WhatsApp


