కలం, వెబ్ డెస్క్: అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేయాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి (Kishan Reddy) పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంతో కలిసి నడుస్తోందని, గత ప్రభుత్వ హయాంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యేవని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ రిమ్స్ (RIMS) ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘క్రిటికల్ కేర్ యూనిట్’ను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన ప్రారంభించారు.
గతంతో పోలిస్తే మెరుగైన పరిస్థితి
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్ రెడ్డి (Kishan Reddy) మాట్లాడుతూ.. గతంలో కేంద్రం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సహకారం ఉండేది కాదని గుర్తుచేశారు. “గతంలో ఇలా కలిసి కూర్చుని ప్రారంభోత్సవాలు చేసుకునే పరిస్థితి ఉండేది కాదు. సాక్షాత్తు ప్రధాన మంత్రి గారే అభివృద్ధి పనుల కోసం ఢిల్లీ నుంచి ఇక్కడికి వస్తే, అప్పటి ముఖ్యమంత్రికి కనీసం కలిసే తీరిక ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి వస్తోంది, ఇది ప్రజలకు మేలు చేస్తుంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఎన్నికల సమయంలోనే రాజకీయం..
ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు ఉండాలని, గెలిచిన తర్వాత ప్రజా ప్రతినిధులందరూ ప్రజలకు మేలు చేయడం కోసం ఐక్యంగా పనిచేయాలని కిషన్ రెడ్డి సూచించారు. అభివృద్ధి విషయంలో రాజకీయ రంగు పులమడం సరికాదని హితవు పలికారు. ఇదే క్రమంలో ఆదిలాబాద్ ప్రజలకు మరో శుభవార్త చెబుతూ.. త్వరలోనే ఇక్కడ కేంద్రీయ విద్యాలయాన్ని కూడా ప్రారంభించుకోబోతున్నామని వెల్లడించారు.
ఆరోగ్యంపై అవగాహన అవసరం
ప్రజలు అనారోగ్యం పాలైన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే, ముందే జాగ్రత్తలు పాటించడం ముఖ్యమని కేంద్ర మంత్రి కోరారు. ముఖ్యంగా ఫెర్టిలైజర్స్, కెమికల్స్ వాడకం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, సహజ వ్యవసాయం (Natural Farming) వైపు మళ్లాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. భారతదేశాన్ని ఆర్థికంగానే కాకుండా ఆరోగ్యంగా కూడా అభివృద్ధి పథంలో నిలపడమే లక్ష్యమని తెలిపారు.
స్థానికంగానే మెరుగైన వైద్యం.. మంత్రి జూపల్లి
రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రిమ్స్‌లో క్రిటికల్ కేర్ యూనిట్ అందుబాటులోకి రావడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో స్థానికులు హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం తప్పుతుందని చెప్పారు. ఈ యూనిట్ శనివారం నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుందని తెలిపారు.
Read Also: త్వరలో బీజేపీలో చేరుతా: రాజాసింగ్
Follow Us On: Pinterest


