కలం వెబ్ డెస్క్ : టాలీవుడ్లో ఫిలిం ఛాంబర్ ఎన్నికల (Film Chamber Elections) వేళ నిర్మాతల మధ్య విబేధాలు బయటపడుతున్నాయి. ఎన్నికల తీరు చిన్న నిర్మాతలు వర్సెస్ బడా నిర్మాతలు అన్నట్లుగా మారింది. ప్రముఖ నిర్మాత ప్రసన్నకుమార్ పెద్ద నిర్మాతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో సీఎం మాటలను కొందరు పెద్దలు వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఇండస్ట్రీ మొత్తం ఒక్కరి చేతుల్లోనే ఉందని వ్యాఖ్యానించారు. చిన్న నిర్మాతలకు కూడా థియేటర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బెనిఫిట్ షోలు వేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. మన ప్యానెల్ సభ్యులతో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమ సమస్యలను పరిష్కరిస్తే ఎన్నికల నుంచి ఉపసంహరించుకుంటామని స్పష్టం చేశారు.
పేరుకే పెద్ద ప్రొడ్యూసర్లు కానీ వాళ్ల మనసు మాత్రం పెద్దది కాదని ప్రసన్న కుమార్ అన్నారు. ఐకానిక్ టవర్స్ రెండున్నరేళ్ల నుంచి ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. ఎన్నికల ఖర్చు కోసం కోట్లాది రూపాయలు ఉపయోగించే వాళ్లు చిన్న ప్రొడ్యూసర్లు కష్టాల్లో ఉంటే ఎందుకు పట్టించుకోరని నిలదీశారు. ఫిలిం ఛాంబర్ నష్టాల్లో ఉంటే తానే లాభాల్లోకి తీసుకొచ్చానన్నారు. చిన్న సినిమాలు బతకాలంటే టికెట్ల ధరలు అందుబాటులో ఉండాలని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా టికెట్ల రేట్లను మార్చను అన్న మాటను కొందరు మార్పించి ధరలు పెంచారని విమర్శించారు. చిన్న ప్రొడ్యూసర్లకు లాభం చేసే వాళ్లే తమకు కావాలని స్పష్టం చేశారు. రెండున్నరేళ్ల క్రితం గెలిచి ఏం పీకారో వాళ్లకే తెలియాలన్నారు. కొందరు ఇండస్ట్రీని నాశనం చేస్తున్నారని పేర్లు ప్రస్తావించకుండా విమర్శలు గుప్పించారు. చిన్న సినిమాలకు మేలు చేస్తామంటే ఎన్నికల (Film Chamber Elections) నుంచి డ్రాప్ అయిపోతామని స్పష్టం చేశారు. ఫిలిం ఛాంబర్ ఎన్నికలు డిసెంబర్ 28న జరుగనున్నాయి. ఈ సమయంలో చిన్న నిర్మాతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
Read Also: ‘లెనిన్’ అదిరిపోయే అప్డేట్!
Follow Us On: Instagram


