కలం, వెబ్ డెస్క్: మొబైల్ రీఛార్జ్ చేసేటప్పుడు ఒక్క నంబర్ మారినా, మనం పంపిన డబ్బులు పొరపాటున వేరే ఎవరికో వెళ్లిపోతాయి. నేటి డిజిటల్ యుగంలో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్ వంటి యాప్స్ ద్వారా సులభంగా రీఛార్జ్ చేసుకుంటున్నారు. అయితే కొన్నిసార్లు చిన్న నిర్లక్ష్యం వల్ల తప్పుడు నంబర్‌కు రీఛార్జ్ (Recharge Mistake) చేస్తుంటాం.
ఇలాంటి పొరపాటు జరిగినప్పుడు కంగారు పడటం సహజం. కానీ, కంగారు పడాల్సిన అవసరం లేదంటున్నారు టెక్ నిపుణులు. అవును, సరైన పద్ధతులు పాటిస్తే ఆ డబ్బులు లేదా రీఛార్జ్‌ను తిరిగి పొందే అవకాశాలు కూడా ఉన్నాయట. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
జియో వినియోగదారులు పొరపాటున వేరే నంబర్‌కు రీఛార్జ్ చేస్తే.. ‘My Jio ‘యాప్ ద్వారా తప్పుగా చేసిన రీఛార్జ్‌ను రద్దు చేసుకోవచ్చు. దీని కోసం ముందుగా యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. తర్వాత రీఛార్జ్ వివరాల విభాగంలోకి వెళ్లి, అందుబాటులో ఉన్న క్యాన్సిల్ ఆప్షన్ ద్వారా రిఫండ్ పొందే అవకాశం ఉంటుంది.
ఎయిర్‌టెల్ కస్టమర్లు పొరపాటున వేరే నంబర్‌కు రీఛార్జ్ చేస్తే ‘Airtet Thanks’ యాప్‌లోని హెల్ప్ సెక్షన్ ద్వారా తప్పుగా చేసినా రీఛార్జ్ ను రద్దు చేసుకోవచ్చు. దీనికోసం యాప్‌లోని హెల్ప్ సెక్షన్‌కు వెళ్లి, రాంగ్ రీఛార్జ్ రివర్సల్ ఆప్షన్‌ను ఎంచుకుంటే తప్పుగా చేసిన రీఛార్జ్‌ను రద్దు చేసుకునే అవకాశం ఉంటుందట.
VI (Vodafone Idea) వినియోగదారులు పొరపాటున వేరే నంబర్‌కు రీఛార్జ్ చేస్తే, కస్టమర్ సపోర్ట్ ద్వారా దానిని సరిచేసుకోవచ్చట. ఇందుకోసం కంపెనీ నంబర్ 51619కు కాల్ చేసి లేదా SMS పంపి తప్పుడు రీఛార్జ్ రివర్సల్ ప్రక్రియను ప్రారంభించవచ్చని చెబుతున్నారు.
అయితే, ఈ ప్రక్రియను లావాదేవీ జరిగిన 1 నుంచి 3 గంటలలోపు వేగంగా పూర్తి చేయడం ద్వారా రిఫండ్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

