కలం, కుభీర్: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కుభీర్ (Kubeer Mandal) మండలంలోని పార్డి (బి), హల్దా గ్రామాల్లో కలెక్టర్ పర్యటించి స్థానిక ప్రజలు, రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ముందుగా పార్డి (బి) గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్.. గ్రామంలో నెలకొన్న సమస్యలను స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా తాగునీటి ఇబ్బందులను తొలగించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చిన వెంటనే పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ గ్రామ సమస్యలను పరిష్కరించాలన్నారు.
అనంతరం హల్దా గ్రామంలో రైతులతో సమావేశమైన కలెక్టర్.. గ్రామంలో నెలకొన్న సీలింగ్ భూములకు సంబంధించిన సమస్యలపై ఆరా తీశారు. భూములకు సంబంధించిన వివరాలను అధికారులు, రైతులను అడిగి తెలుసుకున్నారు. సీలింగ్ భూముల సమస్యలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రైతులకు వివరించారు. ఈ పర్యటనలో తహసీల్దార్ శ్రీదేవి, సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

