కలం యాదగిరిగుట్ట: పాఠశాల విద్యార్థుల యూనిఫాంల కుట్టు పనులను సకాలంలో పూర్తి చేసి పంపిణీ చేయాలని యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా వస్త్రాల సరఫరా, కటింగ్, కుట్టు పనులు, నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తుండాలన్నారు.
ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన..
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని వరి మినహా ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రైతు వేదికలు, క్షేత్ర స్థాయి సిబ్బంది ద్వారా ప్రత్యామ్నాయ పంటలపై ప్రచారం నిర్వహించి, రైతులు ఎక్కువ సంఖ్యలో వాటి సాగు చేపట్టేలా ప్రోత్సహించాలని సూచించారు.
సీఎస్ సమీక్షలో పాల్గొన్న కలెక్టర్..
అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ అనురాగ్ జయంతి పాల్గొన్నారు. ఎల్ నినో ఉన్నప్పటికీ భూములను బీడుగా వదిలిపెట్టకుండా రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ప్రోత్సహించాలని సూచించారు. కంది, పెసర, మినుములు, ఇతర పప్పుధాన్యాలు, అలసందలు, పొద్దుతిరుగుడు, కూరగాయలు, చిరుధాన్యాలు వంటి పంటలను సాగు చేయించేలా చూడాలన్నారు.
వరి సాగు తగ్గించాలి..
జులై 27 నుంచి 29వ తేదీ వరకు రైతు వేదికల్లో ప్రత్యామ్నాయ పంటల విత్తన మేళాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. భూగర్భ జలాలు తగ్గుతున్నందున బోరు నీటిపై ఆధారపడిన వరి సాగును నిరుత్సాహపరచాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి రమణారెడ్డి, జిల్లా ఉద్యానవన అధికారి హేమలత, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

