చెస్ ఒలింపియాడ్‌కు భారత జట్లు ఖరారు

కలం, వెబ్ డెస్క్: డిఫెండింగ్ ఛాంపియన్‌గా (Chess Olympiad) బరిలోకి దిగుతున్న భారత్, 2026 ఫిడే చెస్ ఒలింపియాడ్‌కు పురుషులు, మహిళల జట్లను ప్రకటించింది. సెప్టెంబర్ 16 నుంచి 27 వరకు ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌లో ఈ టోర్నీ జరగనుంది. 2024లో తొలిసారి ఓపెన్, మహిళల విభాగాల్లో స్వర్ణ పతకాలు గెలిచిన భారత్.. ఈసారి కూడా అదే విజయాన్ని పునరావృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పురుషుల జట్టులో డి. గుకేశ్, ఆర్జున్ ఎరిగైసి, ఆర్. ప్రగ్యానంద, నిహాల్ సరిన్, విదిత్ గుజ్రాతి చోటు దక్కించుకున్నారు. శ్రీనాథ్ నారాయణన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. గత జట్టుతో పోలిస్తే నిహాల్ సరిన్ మాత్రమే కొత్త ఆటగాడు.

మహిళల జట్టులో కోనేరు హంపీ, ఆర్. వైశాలి, దివ్యా దేశ్‌ముఖ్, వంతికా అగర్వాల్, సవితా శ్రీ బి ఎంపికయ్యారు. స్వయం మిశ్రా జట్టుకు కెప్టెన్‌గా ఉంటారు. గత జట్టులోని ఇద్దరి స్థానంలో హంపీ, సవితా చేరారు. ఇటీవల నార్వే చెస్ టోర్నీ గెలిచిన ప్రగ్యానంద మంచి ఫామ్‌లో ఉన్నాడు. మరోవైపు, మహిళల కాండిడేట్స్ టోర్నీ విజేతగా నిలిచిన వైశాలి కూడా భారత ఆశలను పెంచుతోంది.

అయితే చెన్నై గ్రాండ్ మాస్టర్స్‌లో నిరాశపరిచిన గుకేశ్ ఈ టోర్నీలో మళ్లీ తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఇదిలా ఉండగా, భారత చెస్‌కు మరో గౌరవం దక్కింది. ఫిడే డిప్యూటీ ప్రెసిడెంట్‌గా ఉన్న విశ్వనాథన్ ఆనంద్ తాత్కాలిక ఫిడే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత అధ్యక్షుడు ఆర్కడీ ద్వోర్కోవిచ్ తాత్కాలికంగా తన అధికారాల నుంచి తప్పుకోవడంతో, ఫిడే నిబంధనల ప్రకారం ఆనంద్ ఆ బాధ్యతలు స్వీకరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>