కలం, వెబ్‌డెస్క్: ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళనల్లో అరాచక శక్తులు చొరబడ్డాయని, స్టూడెంట్స్ ముసుగులో పోలీసులు, జర్నలిస్టులపైనే దాడులకు తెగపడ్డారని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు. నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఢిల్లీలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల పార్లమెంట్ ముట్టడికి యత్నించారు. ఈ సమయంలో విద్యార్థులు, పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. దీనిపై బండి సంజయ్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ ఆందోళనల్లో సంఘ విద్రోహ శక్తులు పాల్గొన్నారని ఆరోపించారు. పార్లమెంట్‌పై దాడికి ప్లాన్ చేశారని వ్యాఖ్యానించారు. జర్నలిస్టులు, పోలీసులపైనే దాడులు చేశారన్నారు. వీరి దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు అయినట్లు తెలిపారు. అరాచక శక్తుల పైనే పోలీసులు లాఠీలు వాడారని బండి తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై పాక్ నుంచి విష ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న 480 పాక్ సోషల్ మీడియా అకౌంట్స్ బ్యాన్ చేసినట్లు వెల్లడించారు.
నీట్‌కు ఆర్టికట్ 370కి సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పేపర్ లీకేజీకి సంబంధించి ఇప్పటి వరకు 17 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ కూడా దీనికి క్షమాపణ చెప్పారని వెల్లడించారు. అన్నీ పూర్తి చేసి 40 రోజుల్లోనే నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించామని చెప్పారు. ఢిల్లీ ఆందోళనల్లో కొందరు శ్రీరాముడు, సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారని, నీట్‌కు, వీటికి సంబంధం ఏమిటని బండి సంజయ్ ప్రశ్నించారు.
విద్యార్థుల ఉద్యమంలో దేశ వ్యతిరేక నినాదాలు ఎందుకు వచ్చాయని బండి అన్నారు. ఇది నిజమైన విద్యార్ణుల ఉద్యమం కాదని చెప్పారు. విపక్షాలకు సమస్య పరిష్కారంతో అవసరం లేదని, రాజకీయం కోసమే వాడుకుంటున్నారని విమర్శించారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 18 పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయని బండి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఎంతమంది రాజీనామా చేశారని ప్రశ్నించారు.

