కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని విశ్వనాథ్‌పేట్ వైఎస్సార్ నగర్ కాలనీలో ఈ నెల 15న జరిగిన యువకుడు అస్లాం ఖాన్ హత్య కేసును నిర్మల్ (Nirmal) పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి ముగింపు పలికి వివాహం చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్న అస్లాం ఖాన్‌ను హత్య చేయించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన మృతుడి సవతి తల్లి అన్వరి బేగంతో పాటు ఆరుగురిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వనాథ్‌పేట్ కాలనీలో నివాసముంటున్న అస్లాం ఖాన్‌కు తన సవతి తల్లి అన్వరి బేగంతో కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగుతోంది. అస్లాం వివాహం చేసుకుని కుటుంబ జీవితం ప్రారంభించాలని నిర్ణయించుకోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. వివాహం చేసుకోవద్దని, తమ సంబంధం ఇలాగే కొనసాగించాలని అన్వరి బేగం ఒత్తిడి చేయడమే కాకుండా, పెళ్లి చేసుకుంటే చంపిస్తానని బెదిరించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ విషయాన్ని అస్లాం తన బాబాయ్ అంజాద్ ఖాన్‌కు చెప్పడంతో కుటుంబంలో వివాదాలు చోటుచేసుకున్నాయి.
అనంతరం అస్లాం తన బాబాయ్ వద్దకు వెళ్లి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అస్లాంను హత్య చేయాలని నిర్ణయించుకున్న అన్వరి బేగం మహారాష్ట్రకు చెందిన తన పరిచయస్తుడు ముఖీద్‌ను సంప్రదించి రూ.6 లక్షలకు సుపారీ ఇచ్చింది. అడ్వాన్సుగా రూ.50 వేలు చెల్లించింది. ఈ నెల 1న నిర్మల్‌కు వచ్చిన సుపారీ గ్యాంగ్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో అస్లాంను హత్య చేయడానికి ప్రయత్నించినప్పటికీ, అక్కడ ప్రజలు ఎక్కువగా ఉండటంతో వెనుదిరిగింది.
అయితే ఆ తర్వాత ఈ నెల 14న మహారాష్ట్ర నుంచి స్కార్పియో వాహనంలో నిర్మల్‌కు వచ్చిన నిందితులు, 15వ తేదీ ఉదయం విశ్వనాథ్‌పేట్ వద్ద రెక్కీ నిర్వహించారు. ఆటోలో ప్రయాణికులతో వెళ్తున్న అస్లాం ఖాన్‌పై కత్తులతో దాడి చేసి హత్య చేసి, అనంతరం సారంగాపూర్ మీదుగా మహారాష్ట్రలోని నాందేడ్‌కు పరారయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా రికార్డులను విశ్లేషించి ప్రధాన నిందితురాలు అన్వరి బేగంతో పాటు ముఖీద్, అఫ్రోజ్, షేక్ షాహిద్, సల్మాన్, సాయినాథ్ పవార్, షేక్ మహమ్మద్‌ను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన స్కార్పియో వాహనం, బైక్, రెండు కత్తులు, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సంచలన హత్య కేసును తక్కువ సమయంలో ఛేదించిన డీఎస్పీ శ్రీనివాస్, దర్యాప్తు బృందం అధికారులను ఎస్పీ అభినందించారు.

