కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) రూరల్ మండలం న్యూ పోచంపాడ్ (New Pochampad) గ్రామంలో గ్రామస్తులు తమ జీవనాధారమైన కిష్ణమ్మ చెరువును కాపాడుకునేందుకు ఏకమయ్యారు. దశాబ్దాలుగా గ్రామ అవసరాలను తీర్చిన చెరువు ఇప్పుడు అక్రమ డీ–1 పట్టాల వివాదంలో చిక్కుకుపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ముంపు కారణంగా సుమారు 65 ఏళ్ల క్రితం గ్రామ అవసరాల కోసం మూడు చెరువులను ఏర్పాటు చేశారు.
వాటిలో సర్వే నంబర్ 173లో ఉన్న 13 ఎకరాల విస్తీర్ణం గల కిష్ణమ్మ చెరువు గ్రామానికి ప్రధాన నీటి వనరుగా కొనసాగుతోంది. అయితే 2016–17లో భాగ్యనగర్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అక్రమంగా డీ–1 పట్టాలు సృష్టించి చెరువులో సుమారు మూడు ఎకరాల భూమిని తమ పేర్లపై పట్టా చేసుకుని సాగు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెరువు విస్తీర్ణం తగ్గిపోవడం వల్ల భవిష్యత్తులో నీటి నిల్వ సామర్థ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని స్థానిక ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసి చెరువును పరిరక్షించాలని కోరినట్లు గ్రామస్తులు తెలిపారు.
అనంతరం రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి చెరువు హద్దులను గుర్తించి సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. అయితే అక్రమ పట్టాలు పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు గ్రామ వీడీసీ సభ్యులకు కోర్టు నోటీసులు పంపిస్తూ ఒత్తిడి తీసుకొస్తున్నారని అన్నారు. “చెరువు మా గ్రామానికి (New Pochampad) జీవనాధారం.. దాన్ని కాపాడుకోవడం మా బాధ్యత” అంటూ గ్రామస్తులు ఒక్కటై జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని అక్రమ డీ–1 పట్టాలను రద్దు చేసి చెరువును ప్రభుత్వ రికార్డుల్లో యథాతథంగా పరిరక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: మార్కెట్లో జోరుగా నాన్-ట్రేడ్ సిమెంట్ హవా.. నాణ్యతపై ప్రశ్నలు
Follow Us On : WhatsApp

