కలం, తెలంగాణ బ్యూరో: “ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ప్రాథమిక హక్కు.. విద్యార్థులు వారి హక్కుల కోసం ప్రశ్నిస్తుంటే లాఠీఛార్జి చేయడం రాజ్యాంగ విరుద్ధం..” ఇదీ జాతీయ, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, మంత్రులు చెప్తున్న మాట. ప్రశ్నాపత్రాల లీకేజీలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పోరాడుతున్న నిరుద్యోగ విద్యార్థులపై పోలీసులు బలప్రయోగం చేయడాన్ని నిరసిస్తూ ప్రధాని నివాసం దగ్గర రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్లలో నిర్బంధించడానికి వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు ర్యాలీలు చేశారు.
జాతీయ స్థాయిలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ (Congress) ధోరణి ఇలా ఉంటే తెలంగాణలో అధికారంలో ఉండి వ్యవహరిస్తున్న తీరు దీనికి పూర్తి భిన్నంగా ఉన్నది. రాష్ట్రంలో పలు సమస్యలపై ప్రతిపక్షాలు నిరసన చేపడుతామంటే అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించి తెచ్చుకోవాల్సి వస్తున్నది. ప్రజాస్వామిక హక్కుల గురించి పాఠాలు చెప్తూ తెలంగాణలో విరుద్ధంగా వ్యవహరిస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా.. ఉద్యోగాల కోసం ప్రశ్నిస్తున్న యువతపై పోలీసులు లాఠీచార్జీ చేసిన ఘటనలూ ఉన్నాయి. ప్రజాపాలన అని చెప్తూ ఇలా వ్యవహరించడం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కేంద్రంలో ప్రతిపక్షంగా విద్యార్థుల తరఫున రోడ్లపైకి వచ్చి కాంగ్రెస్ నిరసనలు తెలుపుతుంటే, రాష్ట్రంలో అధికారంలో ఉన్న అదే పార్టీ.. నిరుద్యోగుల ఆందోళనలను మాత్రం అడ్డుకుంటున్నది. ప్రశ్నించినందుకు నిర్బంధిస్తున్నది. ధర్నాలు, నిరసనల కోసం ప్రతిపక్షాలు హైకోర్టును ఆశ్రయించాల్సి వస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్లలో 70 వేల ఉద్యోగాలు ఇచ్చినా నిరుద్యోగుల్లో, విద్యార్థుల్లో అసంతృప్తి కొనసాగుతూనే ఉన్నది. గతేడాది ముఖ్యమంత్రి ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అమలుపై పట్టుబడుతున్నారు.
దిల్‌సుఖ్‌నగర్, అశోక్‌నగర్, గాంధీనగర్, ఇందిరా పార్కు తదితర ప్రాంతాల్లో నిరసన ర్యాలీలకు ప్రయత్నించినా పోలీసు ఆంక్షలతో మధ్యలోనే ఆగిపోయాయి. ప్రభుత్వం జారీచేసిన జీవో నెం. 29ను సవరించాలని, గ్రూప్ పరీక్షలను వాయిదా వేయాలనే డిమాండ్లతో చిక్కడపల్లిలో నిరుద్యోగులు రోడ్డెక్కారు. వీధుల్లోకి వచ్చిన యూత్‌ను పోలీసులు అదుపు చేయలేక లాఠీలకు పనిచెప్పారు. చివరకు హాస్టల్స్, టీ స్టాల్స్ దగ్గర ఉన్నవారిని సైతం అరెస్టు చేశారు. అప్పట్లో ఇది విమర్శలకు దారితీసింది. దిల్‌సుఖ్‌నగర్, సరూర్‌నగర్ ప్రాంతాల్లో డీఎస్సీ, గ్రూపు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మెరుపు ర్యాలీకి దిగారు. పోలీసులు రోడ్డు మీద నుంచి విద్యార్థులను ఈడ్చుకెళ్లి వ్యాన్‌లలో ఎక్కించడం, స్టేషన్లలో గంటల తరబడి నిర్బంధించడాన్ని విపక్షాలు విమర్శించాయి.
ధర్నాచౌక్‌గా మారిన సెక్రటేరియెట్
గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు కొంత ప్రజాస్వామ్య వాతావరణ ఉన్నదనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. వివిధ సెక్షన్ల ప్రజలు నిరసనలు తెలియజేయడానికి కొన్ని సందర్భాల్లో సచివాలయాన్ని వేదికగా మార్చుకున్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో వివిధ పార్టీలకు అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘాలు ‘సచివాలయం ముట్టడి’ పేరుతో నిరసన ప్రదర్శనలు చేశాయి.
తెలంగాణ స్పెషల్ పోలీసు కుటుంబాల సభ్యులు, మహిళలు, ‘ఏక్ బెటాలియన్’ విధానానికి వ్యతిరేకంగా రోడెక్కారు. సెక్రటేరియెట్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డుపై ఒత్తిడి పెంచే తీరులో ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయాలంటూ డీజీపీ ఆఫీస్ ముందు ధర్నా జరిగింది. ఇలాంటి అన్ని సందర్భాల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నా.. సరూర్‌నగర్, చిక్కడపల్లి లాంటి సందర్భాల్లో లాఠీచార్జీకి పాల్పడడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.
రాజకీయ అవసరాలకు తగ్గట్టు..!
ఢిల్లీ జంతర్ మంతర్ ఘటన, ఆ తర్వాత రాహుల్‌గాంధీ అరెస్టు విషయంలో ప్రజాస్వామిక సూత్రాలను, రాజ్యాంగ హక్కుల గురించి ప్రస్తావిస్తున్న కాంగ్రెస్ తెలంగాణలో మాత్రం విరుద్దంగా వ్యవహరించడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న హరీశ్‌రావును గంటల తరబడి పోలీసు స్టేషన్‌లో కూర్చోబెట్టిన అంశాన్ని బీఆర్ఎస్ ప్రస్తావిస్తున్నది. ‘గాంధీభవన్ ముట్టడి’ పిలుపునిచ్చిన బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావును అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించిందని కమలం పార్టీ కేడర్ కూడా తప్పుపట్టింది.
ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతున్న కాంగ్రెస్.. తెలంగాణలో చేస్తున్న పని అదే కదా అనే నిందలను మూటగట్టుకున్నది. ఢిల్లీలో పోలీసుల లాఠీఛార్జ్ ప్రజాస్వామ్యానికే మచ్చ అని కామెంట్ చేస్తున్న రాష్ట్ర మంత్రులు, పీసీసీ చీఫ్ తెలంగాణలో జరిగిన లాఠీచార్జీల గురించి, గాయపడిన విద్యార్థుల గురించి ప్రతిపక్షాలు ప్రస్తావిస్తున్నాయి. కేవలం పొలిటికల్ మైలేజ్ కోసమే రాహుల్‌గాంధీ అరెస్టును కాంగ్రెస్ (Congress) వాడుకుంటున్నదనే అభిప్రాయలూ ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ పాలనలోని కొన్ని ఘటనలు :
• 2024 జులై 13 : డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని, గ్రూప్-2, 3 పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ దిల్‌సుఖ్‌నగర్, అశోక్‌నగర్ ప్రాంతాల్లో యూత్ మెరుపు ర్యాలీలు. అరెస్టు, పోలీసు స్టేషన్లకు తరలింపు.
• 2024 అక్టోబర్ 26 : ‘ఏక్ బెటాలియన్’ స్థానంలో ‘ఏక్ పోలీస్’ విధానాన్ని అమలు చేయాలని, దీర్ఘకాలం బదిలీలు లేకుండా కుటుంబానికి దూరంగా పోస్టింగ్ కొనసాగించే విధానానికి స్వస్తి చెప్పాలని డిమాండ్ చేస్తూ స్పెషల్ బెటాలియన్ పోలీసుల కుటుంబ సభ్యులు సచివాలయాన్ని ముట్టడించారు. వారిపై లాఠీచార్జి, పోలీసులు వ్యాన్లో ఎక్కించే తీరుపై విమర్శలు వచ్చాయి.
• 2024 అక్టోబర్ 16 : ప్రభుత్వం జారీచేసిన జీవో 29 కారణంగా రిజర్వేషన్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని, దీన్ని సవరించాలని, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అశోక్‌నగర్‌లో వేలాది మంది విద్యార్థులు రోడ్డెక్కారు. మెరుపు ర్యాలీ ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు.
• 2024 అక్టోబర్ 18: ఇవే డిమాండ్లతో మరికొందరు అభ్యర్థులు ఇందిరా పార్క్ నుంచి సచివాలయం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు లాఠీఛార్జి చేశారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
• 2024 నవంబర్: ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అమలుపై స్పష్టత ఇవ్వాలని, జాబ్ నోటిఫికేషన్లలో సవరణలు చేయాలని డిమాండ్ చేస్తూ సరూర్‌నగర్‌లో విద్యార్థులు ‘సచివాలయం ముట్టడి’ పేరుతో రాత్రి సమయంలో హఠాత్తుగా ర్యాలీకి ప్రయత్నించారు. దిల్‌సుఖ్‌నగర్ దగ్గర కొద్దిమందిని అదుపులోకి తీసుకోగా సచివాలయం వరకూ చేరుకుని నిరసనలు తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేశారు.
• 2025 జనవరి 8: జాబ్ క్యాలెండర్‌లో ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, నోటిఫికేషన్లను జారీ చేయాలని డిమాండ్ చేస్తూ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ నుంచి అశోక్‌నగర్ క్రాస్ రోడ్స్ వరకు మెరుపు ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు, నిరుద్యోగులు, యువతను పోలీసులు అడ్డుకుని వ్యాన్‌లలో ఎక్కించేటప్పుడు ప్రవర్తించిన తీరుపై విమర్శలు వచ్చాయి.

