కలం, నిర్మల్ : రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MLA Alleti Maheshwar Reddy) తీవ్ర విమర్శలు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించనున్న “ఫీజు బకాయి – బీజేపీ లడాయి” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను హైదరాబాద్‌లోని నిజాం కళాశాల మైదానంలో గురువారం ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల పక్షాన బీజేపీ అండగా ఉంటుందని ఏలేటి స్పష్టం చేశారు.

