కలం, వెబ్ డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో పాలనాపరమైన భారీ మార్పులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నగరం ఔటర్ రింగ్ రోడ్డు (ORR) వరకు విస్తరించిన నేపథ్యంలో, ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు డివిజన్ల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ గురువారం నిర్ణయం తీసుకున్నారు.
300 డివిజన్లుగా గ్రేటర్ హైదరాబాద్
ప్రస్తుతం నగరంలో ఉన్న 150 డివిజన్ల సంఖ్యను పెంచుతూ, మొత్తం 300 డివిజన్లుగా పునర్విభజనను ఖరారు చేశారు. కొత్తగా ఏర్పడిన డివిజన్ల సరిహద్దుల వివరాలను అన్ని సర్కిల్, జోనల్, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయాల నోటీసు బోర్డుల్లో ప్రజల సమాచారం కోసం ప్రదర్శించనున్నారు. అలాగే, అధికారిక వెబ్‌సైట్ ghmc.gov.in లో కూడా పూర్తి వివరాలు అందుబాటులో ఉంచారు.
రెట్టింపైన జోన్లు, సర్కిళ్లు
నగర విస్తీర్ణం 650 చదరపు కిలోమీటర్ల నుండి సుమారు 2,000 చదరపు కిలోమీటర్లకు పెరగడంతో, పాలనా సౌలభ్యం కోసం జోన్లు, సర్కిళ్ల సంఖ్యను ప్రభుత్వం రెట్టింపు చేసింది. ప్రస్తుతం ఉన్న 6 జోన్లను 12 జోన్లుగా పెంచారు. 30 సర్కిళ్లను 60 సర్కిళ్లుగా విస్తరించారు. కొత్తగా ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్‌గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని కొత్త జోన్లు ఏర్పాటయ్యాయి.
సర్కిల్ ఆఫిీస్‌లలో కొత్త జోన్ కార్యాలయాలు ఏర్పాటు కానుండగా, వార్డు ఆఫీసుల్లో నూతన సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. త్వరలో కొత్తగా ఏర్పాటు కానున్న జోనల్, సర్కిల్ కార్యాలయాల నుంచి పరిపాలన జరగనున్నది.
Read Also: నేతాజీ అవశేషాలు భారత్కు తెప్పించండి.. రాష్ట్రపతికి ముని మనవడి లేఖ
Follow Us On: Instagram


