కలం, పాల్వంచ: పరీక్షల అవకతవకలు, పేపర్ లీకేజీలపై కేంద్ర ప్రభుత్వం దేశ యువత భవిష్యత్తుకు స్పష్టమైన సమాధానం చెప్పాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎస్జేకే అహ్మద్ (SJK Ahmad) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విద్యార్థుల హక్కుల కోసం శాంతియుతంగా ఆందోళన చేపట్టిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఆయన ఖండించారు. గురువారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాసమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతును అరెస్టుల ద్వారా అణిచివేయాలని చూడటం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్బంధ ధోరణికి నిదర్శనమన్నారు.
విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌పై స్వతంత్ర, నిష్పాక్షిక విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, నష్టపోయిన విద్యార్థులకు తక్షణమే న్యాయం చేయాలని కోరారు. దేశ యువత హక్కులు, ఉజ్వల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని అహ్మద్ స్పష్టం చేశారు.

