దేవుడికే శఠగోపం..!

కలం, వరంగల్ బ్యూరో: దేవాదాయ భూములు (Temple Lands) కబ్జాదారుల చెరలో చిక్కాయి. శతాబ్దాల కింద రాజులు, జమీందారులు, భక్తులు దానం చేసిన విలువైన భూములు ఆక్రమణలకు గురవుతుండటంతో దేవాదాయ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు కోర్టుల్లో న్యాయపోరాటాలు చేస్తోంది. ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో మొత్తం 3,995.09 ఎకరాల భూములు ఉండగా.. వీటిలో ఇప్పటికే 1,296 ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది. అంటే మొత్తం భూముల్లో మూడో వంతు భూమి కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

రాయపర్తి మండలం సన్నూరులోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి చెందిన 819 ఎకరాల భూమి కబ్జాదారుల ఆధీనంలో ఉంది. ఒక్క ఆలయానికి చెందిన భూమినే భారీ స్థాయిలో ఆక్రమణకు గురికావడం దేవాదాయ శాఖకు పెద్ద సవాలుగా మారింది. మడికొండ–అయోధ్యపురం ప్రాంతాల్లోని ఆలయాలకు చెందిన 200 ఎకరాలు, వరంగల్ రామన్నపేటలోని కుంటి భద్రయ్య మల్లికార్జునస్వామి ఆలయానికి చెందిన 10 ఎకరాలు కూడా ఆక్రమణల పాలైంది.

నగర శివార్లలోనూ కబ్జాలు

వరంగల్ నగర పరిసరాల్లోని విలువైన దేవాదాయ భూములపైనా కబ్జాదారుల మింగేశారు. బాలానగర్ శ్రీ వెంకటేశ్వరస్వామి టెంపుల్ కు చెందిన 4 ఎకరాల 24 గుంటలు, దేశాయిపేట రంగనాథస్వామి ఆలయానికి చెందిన 7 ఎకరాల 30 గుంటలు ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోనే ఉన్నాయి. ఇవే కాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ ఆలయాలకు చెందిన మరో 255 ఎకరాల భూములు కూడా ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు.

ఆలయాల ఆదాయంపై తీవ్ర ప్రభావం

దేవాదాయ భూములు కేవలం ఆస్తులు మాత్రమే కాదు. ఆలయాల ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. భూముల నుంచి వచ్చే ఆదాయంతోనే నిత్య పూజలు, ధూపదీప నైవేద్యాలు, పండుగలు, ఉత్సవాలు, ఆలయ నిర్వహణ, ఉద్యోగుల వేతనాలు, అభివృద్ధి పనులు కొనసాగుతాయి. భూములు ఆక్రమణకు గురికావడంతో అనేక ఆలయాల ఆదాయం తగ్గిపోయి, నిర్వహణపై ప్రభావం పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆక్రమణకు గురికాని మిగిలిన భూముల్లో 80 శాతం ఆలయాల ధూపదీప నైవేద్యాలు, నిత్య నిర్వహణ కోసం వినియోగిస్తుండగా, 20 శాతం భూమిని లీజుకు ఇవ్వగా వచ్చే ఆదాయాన్నిఆలయాల అభివృద్ధికి ఉపయోగిస్తున్నారు.

కోర్టుల్లో న్యాయపోరాటం

కబ్జాకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం అంత సులభం కాదు. చాలాచోట్ల కబ్జాదారులు కోర్టులను ఆశ్రయించడంతో దేవాదాయ శాఖ కూడా న్యాయం కోసం పోరాడుతోంది. ప్రస్తుతం 95 కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి.

జిల్లా కోర్టుల్లో 4, దేవాదాయ ట్రిబ్యునల్‌లో – 40, హైకోర్టులో – 50, సుప్రీంకోర్టులో – 1 కేసు చొప్పున ఉన్నట్లు అధికారులు చెబుతున్నాయి. ప్రతి కేసును న్యాయపరంగా బలంగా వాదించి తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

భక్తుల ఆందోళన

ఉమ్మడి జిల్లాలో వేల ఎకరాల్లో ఆలయ భూములు కబ్జాల పాలవడం భక్తులను ఆందోళనకు గురుచేస్తోంది. రూ. కోట్ల విలువైన ఆస్తులను కాపాడేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, తిరిగి స్వాధీనం చేసుకోవాలని భక్తులు, హిందూ ధార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఆలయాల ఆర్థిక స్వావలంబన, భవిష్యత్ అభివృద్ధి కోసం దేవాదాయ భూముల పరిరక్షణ అత్యంత కీలకమని అభిప్రాయపడుతున్నారు.

ఎకరం కూడా వదలం

ఆలయ భూములు దేవుడి ఆస్తి. వాటిని ఎవరూ ఆక్రమించే హక్కు లేదు. ఇప్పటికే కబ్జా అయిన భూములను కోర్టుల ద్వారా తిరిగి స్వాధీనం చేసుకుంటాం. కొత్తగా ఆక్రమణలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఒక్క ఎకరం కూడా వదిలే ప్రసక్తే లేదు.
– దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కృష్ణప్రసాద్, సహాయ కమిషనర్ రామల సునీత

సర్వేలు.. రికార్డుల పరిశీలన

ఆలయ భూముల రక్షణకు పాత రికార్డులు, ఫెయిర్ అడంగళ్లు, రెవెన్యూ పత్రాలు, భూ మ్యాపులను దేవాదాయ శాఖ పరిశీలిస్తోంది. అవసరమైన చోట్ల రెవెన్యూ శాఖ సహకారంతో సర్వేలు నిర్వహిస్తోంది. ఆక్రమణలను గుర్తించి చట్టపరమైన చర్యలు చేపడుతోంది. కొత్తగా ఎవరైనా దేవాదాయ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే వెంటనే కేసులు నమోదు చేయాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>