కరీంనగర్‌లో కాంగ్రెస్-బీజేపీ బాహాబాహీ!

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్‌లో(Karimnagar) రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కార్యాలయం (Bandi Sanjay Office) వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రతిపక్ష నాయకుల అరెస్టును ఖండిస్తూ, నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్‌లో నిరసన కార్యక్రమం చేపట్టింది. డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కార్పొరేషన్ కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో గాంధీ రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద శాంతియుత నిరసన నిర్వహించారు. అనంతరం జ్యోతినగర్‌లోని బండి సంజయ్ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

కాంగ్రెస్ కార్యకర్తలు కార్యాలయం వైపు దూసుకెళ్లడంతో పోలీసులు కార్యాలయ గేట్లు మూసివేసి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని, నెట్టివేతలు జరిగాయి. కొంతసేపటికి పరిస్థితి అదుపుతప్పి ఇరువర్గాలు కర్రలు, కుర్చీలతో దాడులకు దిగినట్లు సమాచారం. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జి చేశారు. అనంతరం పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

లాఠీచార్జిలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అస్వస్థతకు గురికావడంతో ఆయనను పోలీసులు అక్కడి నుంచి తరలించారు. అరెస్ట్ అయిన వారిలో డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు తదితరులు ఉన్నారు.ఈ ఘర్షణలలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గాయపడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఘర్షణల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎంపీ కార్యాలయం, డీసీసీ కార్యాలయం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.

కాంగ్రెస్‌తో అమీతుమీకి సిద్ధం: బీజేపీ

మరోవైపు ఈ ఘటనపై బీజేపీ లోక్‌సభ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు స్పందించారు. కాంగ్రెస్ పార్టీతో అమీతుమీకి సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే కాంగ్రెస్ కార్యాలయం ముట్టడికి కూడా వెనుకాడబోమని అన్నారు. ఎంపీ కార్యాలయంలోకి కాంగ్రెస్ నాయకులు అక్రమంగా చొరబడి సిబ్బందిపై దాడికి ప్రయత్నించారని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు కరీంనగర్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, బోయినపల్లి ప్రవీణ్ రావు తదితరులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎంపీ కార్యాలయంలోకి చొరబడి సిబ్బందిని బెదిరించడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం వంటి ఆరోపణలపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>