ఫైర్ సేఫ్టీపై AIFB ఫైర్.. అధికారులకు వినతి

కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) నగర పరిధిలోని ప్రైవేట్ ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తి స్థాయి అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు (Fire Safety Norms) అమలు చేసినప్పుడే ఫైర్ ఎన్‌ఓసీ (No Objection Certificate) మంజూరు చేయాలని లేదా రెన్యూవల్ చేయాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ డిమాండ్ చేశారు.

ఈ మేరకు జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. నేషనల్ బిల్డింగ్ కోడ్ (NBC), తెలంగాణ అగ్నిమాపక చట్టం ప్రకారం ఫైర్ స్ప్రింక్లర్లు, ఫైర్ అలారాలు, అండర్‌గ్రౌండ్ వాటర్ ట్యాంకులు, వెడల్పాటి అత్యవసర నిష్క్రమణ ద్వారాలు (Emergency Exit) వంటి భద్రతా ఏర్పాట్లు ఉన్న భవనాలకు మాత్రమే అనుమతులు ఇవ్వాలని కోరారు. వినతిపత్రాన్ని స్వీకరించిన జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు బండారి శేఖర్ తెలిపారు. ప్రైవేట్ సంస్థలలో భద్రతా ప్రమాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే కొత్త అనుమతులు, రెన్యూవల్స్ మంజూరు చేస్తామని అధికారి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా బండారి శేఖర్ మాట్లాడుతూ, కరీంనగర్ నగరంలో ఉన్న అనేక ప్రైవేట్ ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలు కనీస అగ్నిమాపక భద్రతా నిబంధనలను పాటించడం లేదని ఆరోపించారు. ఇరుకైన భవనాలలో అత్యవసర నిష్క్రమణ ద్వారాలు లేకుండానే వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి పరిస్థితులలో వైద్యం కోసం వచ్చే చిన్నారులు, రోగులు, అలాగే వేలాది మంది విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కొన్ని సంస్థలకు క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే ఫైర్ ఎన్‌ఓసీలు మంజూరైనట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్‌ఓసీ రెన్యూవల్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి భవనాన్ని అధికారులు ప్రత్యక్షంగా తనిఖీ చేసి, భద్రతా ప్రమాణాలు పూర్తిగా అమలులో ఉన్నాయో లేదో నిర్ధారించాలన్నారు.

అగ్నిమాపక భద్రతా నిబంధనలు పాటించని భవనాలకు ఎట్టి పరిస్థితులలోనూ ఫైర్ ఎన్‌ఓసీ మంజూరు చేయరాదని, నిబంధనలను ఉల్లంఘిస్తున్న ఆసుపత్రులు, విద్యాసంస్థలపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో అగ్నిప్రమాదాల వల్ల అమాయకుల ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అగ్నిమాపక శాఖపై ఉందని ఆయన పేర్కొన్నారు. అధికారులు ఇచ్చిన హామీ మేరకు నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేస్తే అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో బాధితులు, ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>