కలం, ఖమ్మం బ్యూరో: “తెలంగాణలో గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను సరిగ్గా నిర్వహించకుండా, విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న అసమర్థ పాలకులను ప్రజలు ఏ విధంగా గద్దె దించారో.. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుంది” అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అప్రజాస్వామిక అరెస్టును ఖండిస్తూ, కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఖమ్మం (Khammam) నగరంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన ప్రదర్శనకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ ప్రవేశ పరీక్షను కూడా పారదర్శకంగా నిర్వహించలేని దద్దమ్మ ప్రభుత్వం కేంద్రంలో ఉందన్నారు. నీట్ పరీక్షల్లో జరిగిన తీవ్ర అక్రమాలపై విద్యార్థులు, నిరుద్యోగులు ఢిల్లీ వీధుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుంటే ప్రధాని మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు.
తమ హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువతపై దారుణంగా లాఠీచార్జ్ చేయించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. విద్యావ్యవస్థను నాశనం చేసిన కేంద్ర విద్యాశాఖ మంత్రిని తక్షణమే బాధ్యుడిని చేస్తూ పదవి నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో మోదీ నిరంకుశ పాలన అంతానికి, కేంద్ర ప్రభుత్వ పతనానికి వీధుల్లోకి వచ్చి కథం తొక్కిన ఈ యువతే నిదర్శనంగా నిలవబోతోందని మంత్రి స్పష్టం చేశారు.
తెలంగాణలో నిరుద్యోగుల ఉసురు తగిలి గత ప్రభుత్వం ఎలా కూలిపోయిందో, కేంద్రానికి కూడా విద్యార్థులు, యువత అదే రీతిలో బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, యువజన, విద్యార్థి విభాగాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

