కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) లో జరుగుతున్న బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ నిరసనలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. కాంగ్రెస్ (Congress) నేతలు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆఫీస్‌ను ముట్టడించడంపై బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు (Boinipally Praveen Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఉనికి కోల్పోయిందన్నారు. హస్తం పార్టీని ప్రజలు ప్రతిపక్ష పార్టీగా కూడా గుర్తించడం లేదని విమర్శించారు. అందుకే రాజకీయ డ్రామాలతో ప్రజల్లో గుర్తింపు కోసం కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేస్తోందన్నారు.
కాక్రోచ్ పార్టీతో పోటీ పడేందుకు ధర్నాలు చేస్తుండటం సిగ్గు చేటని విమర్శించారు. రాష్ట్రంలో పాలక పక్షంగా ఉంటూ దౌర్జన్యం చేయాలనుకుంటున్నారా? అని నిలదీశారు. స్వయానా ఎమ్మెల్యేలు ఇలా దాడులను ప్రోత్సహించడం సరికాదన్నారు. కాంగ్రెస్ నేతలు బీజేపీ జోలికొస్తే అంతు చూస్తామని హెచ్చరించారు. ప్రశాంతమైన కరీంనగర్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ నేతల ఆందోళనతో కొద్దిసేపు బండి ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

