epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ట్యాపింగ్ విషయం ఎప్పుడు తెలిసింది? : మాజీ డీజీపీని ప్రశ్నించిన సిట్

కలం, వెబ్​ డెస్క్​: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) దూకుడు పెంచింది. ఈ కేసులో సాక్ష్యాల సేకరణలో భాగంగా అప్పటి రాష్ట్ర పోలీస్ బాస్, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి (Mahender Reddy)ని అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీ విచారణలో వెల్లడించిన అంశాల ఆధారంగా మహేందర్ రెడ్డి స్టేట్‌మెంట్‌ను సిట్ రికార్డు చేసింది. ఈ విచారణలో ప్రధానంగా నియామకాలు, ఆపరేషన్ వివరాలు, ప్రభుత్వ పెద్దల ప్రమేయంపై అధికారులు ఆయన్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఈ ఆపరేషన్‌లో తెరవెనుక ఏం జరిగింది? ఎవరి ఆదేశాల మేరకు విపక్ష నేతలు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ అయ్యాయి? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు.. తాజాగా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి (Mahender Reddy)ని విచారించారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలో అత్యున్నత పదవిలో ఉన్న ఆయనకు తెలియకుండా ఇంత పెద్ద ఆపరేషన్ ఎలా సాధ్యమనే కోణంలో ప్రశ్నించారు.

నిబంధనలకు విరుద్ధంగా ప్రభాకర్ రావును ఎస్‌ఐబీ చీఫ్‌గా నియమించడానికి ఏవైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా? ఆ నియామక ప్రక్రియలో మీ పాత్ర ఎంత?, పోలీసు శాఖకు అధిపతిగా ఉన్న సమయంలో ఒక ప్రత్యేక బృందం ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న విషయం మీ దృష్టికి వచ్చిందా?, వేలాది ఫోన్లు ట్యాప్ అవుతున్నప్పుడు, కనీసం ఏ దశలోనైనా మీకు ఈ వ్యవహారం గురించి సమాచారం అందలేదా..? అని ప్రశ్నించారు.

రాజకీయ నేతలతో పాటు వ్యాపారవేత్తలు, సెలబ్రిటీల ఫోన్లను ట్యాప్ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై ఇంటెలిజెన్స్ విభాగం నుంచి మీకు రిపోర్టులు రాలేదా?, ఈ కీలక ఆపరేషన్ సమయంలో అప్పటి ప్రభుత్వ పెద్దలతో మీరు నేరుగా మాట్లాడారా? దీనిపై వారు మీకు ఏమైనా మౌఖిక ఆదేశాలు ఇచ్చారా? అని అడిగారు. ‘ఫోన్ ట్యాపింగ్ అనేది పూర్తిగా పోలీసు వ్యవస్థకు సంబంధించిన అంశమని, దీనితో ప్రభుత్వానికి సంబంధం లేదు’ అని మాజీ సీఎం కేసీఆర్ చెప్పిన మాటలపై మీ అభిప్రాయం ఏమిటి? అని సిట్​ అధికారుల ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

Read Also: భారత్ అణు శక్తికి స్ట్రాటజిక్ బూస్ట్.. ‘K-4’ మిసైల్ టెస్ట్ సక్సెస్.. విశేషాలివే!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>