కలం, వెబ్డెస్క్: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వేరైనా, ఆ రెండు పార్టీల లక్ష్యం ఒక్కటేనని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. సర్ ప్రక్రియపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. కొడంగల్లో సర్ ప్రక్రియ 78 శాతం పూర్తయ్యిందని సీఎం తెలిపారు. స్వయంగా సర్ ఫామ్ నింపి అధికారులకు అందజేశారు. ఓటు లేని వ్యక్తి చనిపోయిన వ్యక్తితో సమానమని సీఎం అన్నారు. ప్రతి ఒక్కరూ సర్ ఫామ్ నింపి ఓటు హక్కును కాపాడుకోవాలని సూచించారు.
కొడంగల్లో స్థానిక నాయకులు, బీఎల్వోలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. సర్ ప్రక్రియలో అర్హులైన ప్రతి ఓటరును నమోదు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. కొడంగల్లో ఇప్పటి వరకు 1,96,620 ఓట్ల ప్రక్షాళన పూర్తైందన్నారు. ఇంకా 54,635 ఓటర్ల నమోదు పెండింగ్లో ఉందని, ఆగస్టు 3లోగా పూర్తి చేయాలని సూచించారు.
ఓటరు జాబితాలో పేరు లేకుంటే ప్రభుత్వ పథకాలు రావని సీఎం రేవంత్ చెప్పారు. ఆగస్ట్ 3 వరకు సర్ గడువు ఉందని, ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొడంగల్లో తనపై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలని కార్యకర్తలు, నాయకులకు సూచించారు. పేద వాడికి న్యాయం చేసేలా పని చేస్తున్నామని, వాళ్ల తప్పులు ప్రశ్నిస్తున్నందుకే తనపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

