కలం, హనుమకొండ: హనుమకొండ (Hanumkonda) జిల్లా కొత్తకొండలోని కాకతీయుల కాలం నాటి భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) వరుణయాగం, యజ్ఞయాగాలు నిర్వహించారు. ఎల్‌నీనో ప్రభావం తొలగిపోయి రాష్ట్రవ్యాప్తంగా మంచి వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారికి 108 కలశాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించి ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి ఆలయం కాకతీయుల కాలం నాటి మహిమాన్వితమైన క్షేత్రమని, ఈ ప్రాంత ప్రజలకు విశేష విశ్వాసం ఉన్న దేవస్థానమని అన్నారు. ఇక్కడ వరుణ యాగం నిర్వహించడం ద్వారా రాష్ట్రానికి సమృద్ధిగా వర్షాలు కురవాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో వర్షపాతం తగ్గే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ, ప్రజలు భగవంతుడిపై విశ్వాసంతో తెలంగాణ వ్యాప్తంగా దేవాలయాల్లో వరుణ యాగాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రిగా బోనాల పండుగ సందర్భంగా అక్కడి దేవాలయాల్లో కూడా అమ్మవారిని దర్శించుకుని రాష్ట్రానికి మంచి వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణతో పాటు దేశమంతా సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలు బాగా పండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో జీవించాలని స్వామివారిని ప్రార్థించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌లు, మార్కెట్ కమిటీ చైర్మన్‌లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

