మీ సేవ.. అక్రమాల తోవ!

కలం, మెదక్ బ్యూరో: ప్రభుత్వ సేవలను వేగంగా, సులభంగా, పారదర్శకంగా ప్రజలకు అందించాలనే లక్ష్యంతో మీసేవ కేంద్రాలను (MeeSeva Centres) ఏర్పాటు చేసింది. కులం, ఆదాయం, నివాసం, జననం, మరణం, భూములకు సంబంధించిన సేవలు, సంక్షేమ పథకాల వంటి సేవల కోసం ప్రజలు మీసేవ కేంద్రాలకు వెళ్తుంటారు. ఎప్పటికప్పుడు కొత్త సేవలు చేరుతుండగా డిమాండ్ కూడా పెరిగింది. దీంతో కొందరు నిర్వాహకులు ప్రభుత్వం నిర్ణయించిన రుసుము కంటే అధికంగా వసూలు చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి మీసేవ కేంద్రంలో ప్రభుత్వం నిర్ణయించిన రుసుములతో కూడిన సిటిజన్ చార్టర్, ఈఎస్‌డీ నిబంధనలు, భూభారతి వివరాలు, సంబంధిత అధికారుల ఫోన్ నంబర్లు తప్పనిసరిగా ప్రదర్శించాలి.

ఇష్టారాజ్యంగా వసూళ్లు

ఉమ్మడి మెదక్ జిల్లాలో సుమారు 700కు పైగా మీసేవ కేంద్రాలు పని చేస్తున్నాయి. దరఖాస్తుదారులు చెల్లించే ఫీజులో కొంత శాతాన్ని ప్రభుత్వం కమీషన్‌గా చెల్లిస్తున్నప్పటికీ, కొందరు నిర్వాహకులు అదనపు రుసుములు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అంత ఎందుకుని ప్రశ్నిస్తే ‘‘ ఇష్టం ఉంటే చేయించుకోండి.. లేకుంటే వెళ్లండి” అంటున్నారని దరఖాస్తుదారులు వాపోతున్నారు. కొన్ని చోట్ల ‘ సర్వర్ డౌన్’, ‘ టెక్నికల్ సమస్యలు’ పేరుతో దరఖాస్తులను నమోదు చేయకుండా పలుమార్లు తిప్పిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తిరిగి రావడం కష్టమై, అడిగినంత చెల్లిస్తున్నామంటున్నారు. మీసేవ కేంద్రాలను పర్యవేక్షించాల్సిన అధికారులు తనిఖీలు నిర్వహించడం లేదని, ఫలితంగా కొందరు నిర్వాహకులు అధిక వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.

ఇకపై డిజిటల్ రశీదులు

నిర్ణీత రుసుము కంటే ఎక్కువ వసూలు చేసినట్లు ఫిర్యాదు వస్తే సంబంధిత మీసేవ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మెదక్ ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సందీప్ తెలిపారు. అధిక రుసుము డిమాండ్ చేసినా, ఇతర అవకతవకలు జరిగినా తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. పౌర సేవలను మరింత పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. దరఖాస్తుల పరిశీలన మొత్తం ఆన్లైన్‌లోనే జరుగుతుంది. మీసేవలో దరఖాస్తు చేసిన వెంటనే దరఖాస్తుదారుడి మొబైల్‌కు అప్లికేషన్ నంబర్, సేవ వివరాలు, చెల్లించిన ఫీజు, డిజిటల్ రశీదు లింక్‌తో కూడిన ఎస్‌ఎంఎస్ పంపబడుతుంది. ఆ రశీదును ఎప్పుడైనా వీక్షించడం, డౌన్‌లోడ్ చేసుకోవడం లేదా ప్రింట్ తీసుకోవడం సాధ్యమవుతుంది. దీంతో సేవల అందజేతలో పారదర్శకత పెరిగి, ప్రజలకు మరింత వేగంగా సేవలు అందుతాయని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>