కలం, వరంగల్ బ్యూరో: హోమ్ లోన్ (Home Loan) మాఫీ కావడంతోపాటు వివాహేతర సంబంధానికి అడ్డు తొలగిపోతుందని భర్తను హత్య చేయించిందో భార్య. ఎవరికీ అనుమానం రాకుండా రోడ్డు ప్రమాదంలో భర్త చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే, దర్యాప్తులో నిజం తెలియడంతో ఆమెతోపాటు హత్యలో ప్రమేయమున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా కేసముద్రం మండలం బోడమంచతండాలో జరిగింది. గ్రామానికి చెందిన భూక్యా వీరన్న(45), భూక్యా విజయ భార్యాభర్తలు. గ్రామానికే చెందిన బాలాజీతో విజయకు వివాహేతర సంబంధం ఉంది. కాగా, వీరన్న కుటుంబం చాలా ఏళ్లుగా ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది. అప్పుల్ని తీర్చడానికి తమ పొలాన్ని గ్రామంలోని ఆర్ఎంపీ వైద్యుడు భరత్ సాయంతో ఓ ఫైనాన్స్ సంస్థలో తాకట్టు పెట్టి, వీరన్న పేరుతో హోమ్ లోన్ తీసుకున్నారు.
అప్పటి నుంచి రుణం చెల్లించలేక, వాయిదాలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే ఆ లోన్ మాఫీ అవుతుందని తెలియడంతో వీరన్నను చంపి అడ్డు తొలగించుకోవాలని విజయ, బాలాజీ ప్లాన్ వేశారు. దీనికి భరత్ సాయం తీసుకున్నారు. అనంతరం పథకం ప్రకారం బాలాజీ, భరత్.. వీరన్నకు మద్యం తాగించి, ఇనుప రాడ్డుతో కొట్టి చంపేశారు. దాన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు సమీపంలోని గ్రామం వద్ద రోడ్డుపై పడవేశారు. పోలీసుల దర్యాప్తులో ఇది పక్కా హత్యగా తేలింది. దీంతో నిందితులను అరెస్ట్ చేశారు.
Read Also: భారత్ అణు శక్తికి స్ట్రాటజిక్ బూస్ట్.. ‘K-4’ మిసైల్ టెస్ట్ సక్సెస్.. విశేషాలివే!
Follow Us On: X(Twitter)


